భలే భలే బాహుబలి!

నేస్తాలూ.. నమీబియా నుంచి ఇటీవల మన దేశానికి ఎనిమిది చీతాలు వచ్చాయన్న సంగతి మనకు తెలిసిందే కదా! ఇవి అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వరకు విమానంలో వచ్చాయి.

Published : 22 Sep 2022 00:21 IST

నేస్తాలూ.. నమీబియా నుంచి ఇటీవల మన దేశానికి ఎనిమిది చీతాలు వచ్చాయన్న సంగతి మనకు తెలిసిందే కదా! ఇవి అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వరకు విమానంలో వచ్చాయి. అక్కడి నుంచి హెలికాప్టర్‌ సాయంతో వీటిని కునో నేషనల్‌ పార్క్‌కు తీసుకొచ్చారు. అయితే అది మామూలు హెలికాప్టర్‌ కాదు. చినూక్‌ హెలికాప్టర్‌. మరి దాని సంగతులేంటో తెలుసుకుందామా!

మామూలు హెలికాప్టర్‌కు తల మీద పెద్ద పెద్ద బ్లేడ్లుంటాయి. తోక దగ్గర చిన్న బ్లేడ్లుంటాయి. కానీ ఈ చినూక్‌ హెలికాప్టర్‌కు తల మీదే రెండు చోట్ల పెద్ద పెద్ద రెక్కలుంటాయి. చూడ్డానికి కూడా వింతగా ఉంటుంది. మిగతా హెలికాప్టర్లతో పోల్చితే దీనికి చాలా ప్రత్యేకతలుంటాయి.

అమెరికా నుంచి...
ప్రస్తుతం చీతాలు ఎలా అయితే నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయో.. అలాగే ఈ చినూక్‌ హెలికాప్టర్లు కూడా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాయి. వీటిని అమెరికన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీ వెర్టొల్‌ అభివృద్ధి చేసింది. బోయింగ్‌ వెర్టొల్‌ కంపెనీ తయారు చేస్తోంది. ఈ హెలికాప్టర్లను ఓ రకంగా బాహుబలులు అనవచ్చు. ఎందుకంటే ఇవి చాలా బరువులను మోస్తాయి. అదే సమయంలో చాలా వేగంగానూ ప్రయాణిస్తాయి.

వేగంలోనూ...
ఈ హెలికాప్టర్లు 1957 నుంచే తయారవుతున్నాయి. వీటిని అమెరికా సైన్యం పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తోంది. ఇవి గంటకు 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ల్యాండింగ్‌కు అవకాశం లేని కొండలు, గుట్టల్లోనూ సేవలు అందించగలవు. వియత్నాం యుద్ధ అఫ్ఘానిస్థాన్‌లో ఈ చినూక్‌ హెలికాప్టర్లు ప్రముఖ పాత్ర పోషించాయి. వీటిలో మళ్లీ కొన్ని వేరియంట్లు ఉన్నాయి. ఈ చినూక్‌ హెలికాప్టర్లు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, తైవాన్‌, గ్రీస్‌, ఇటలీ, జపాన్‌, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే తదితర దేశాలతో పాటు మన ఇండియాలోనూ ఉన్నాయి.

మన దగ్గర పదుల సంఖ్యలో...
మన భారత ఆర్మీ దగ్గర ఈ చినూక్‌ హెలికాప్టర్లు దాదాపు 15 వరకు ఉన్నాయి. వీటిని మనకు అమెరికా వారు 2019లో అందించారు. ఇవి ఎక్కువగా లద్దాఖ్‌, సియాచిన్‌ ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తున్నాయి. తాజాగా చీతాల ఆపరేషన్‌లోనూ చినూక్‌ను వాడారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ చినూక్‌ హెలికాప్టర్‌ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని