క్లిక్‌.. క్లిక్‌.. భలే భలే మ్యూజియం!

హాయ్‌ నేస్తాలూ! బాగున్నారా.. మీకు ఫొటోలు తీసుకోవడం అంటే భలే సరదా కదూ.. ఇప్పుడంటే అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం చాలా తేలికైంది. కానీ ఒకప్పుడు ఫొటో దిగాలంటే పెద్ద తతంగమే.

Published : 26 Sep 2022 00:58 IST

హాయ్‌ నేస్తాలూ! బాగున్నారా.. మీకు ఫొటోలు తీసుకోవడం అంటే భలే సరదా కదూ.. ఇప్పుడంటే అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం చాలా తేలికైంది. కానీ ఒకప్పుడు ఫొటో దిగాలంటే పెద్ద తతంగమే. అసలు అప్పుడు కెమెరాలు ఎలా ఉండేవో తెలుసా..! ఒక్కసారి ఈ మ్యూజియానికి వెళ్లొస్తే సరి.. మీకే తెలుస్తుంది.

గురుగ్రామ్‌కు చెందిన ఆదిత్య ఆర్య అంకుల్‌ దాదాపు 1000కి పైగా పురాతన కెమెరాలను సేకరించారు. వాటిని తన ఇంట్లోనే జాగ్రత్తగా భద్రపరిచారు. ప్రాచీన విశేషాలను రాబోయే తరాల వారికి చూపించడం కోసమే ఆయన ఇంతలా తపిస్తున్నారు.

35 ఏళ్లుగా..

ఈ అంకుల్‌ 35 సంవత్సరాలుగా కెమెరాలను సేకరిస్తూనే ఉన్నారు. చాలా వరకు కెమెరాలను ఆయన తుక్కు దుకాణాల్లోనూ కొనుగోలు చేశారు. కేవలం కెమెరాలే కాకుండా, ఫిల్మ్‌లు, లెన్స్‌లు, ఇంకా ఫ్లాష్‌ సామగ్రి.. ఇలా ఫొటోగ్రఫీకి సంబంధించిన వస్తువులను సేకరిస్తూనే ఉన్నారు. అన్నట్లు ఈ అంకుల్‌ గతంలో ఫొటోజర్నలిస్టుగా పనిచేశారు. అందుకే కెమెరాల మీద ఆయనకు ఆసక్తి ఏర్పడింది. అదే ఆయన్ను కెమెరాల సేకర్తగా మార్చింది.

ప్రపంచం నలుమూలల నుంచీ..

ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ అంకుల్‌ అత్యంత అరుదైన కెమెరాలను సేకరించారు. దీని కోసం ఆయన చాలా కష్టపడ్డారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ చిత్రాలను చిత్రించిన కెమెరా నుంచి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వాళ్లు తయారు చేసిన కెమెరా వరకూ ఈ అంకుల్‌ దగ్గర ఉన్నాయి. ఒకేసారి 15 ఫొటోలను తీసే అరుదైన కెమెరా కూడా ఈయన నెలకొల్పిన మ్యూజియంలో ఉంది. ఈ అంకుల్‌ అమెరికా, సింగపూర్‌, చైనా తదితర దేశాల నుంచీ కెమెరాలు సేకరించారు. అందుకే ఈ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆసియా ఖండంలో అతిపెద్ద పురాతన కెమెరాలను కలిగి ఉన్న సంగ్రహణాలయంగా రికార్డు దక్కించుకుంది. మొత్తానికి క్లిక్‌.. క్లిక్‌.. మ్యూజియం, అదే నేస్తాలూ.. అతిప్రాచీన కెమెరాల మ్యూజియం విశేషాలు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు