Updated : 02 Oct 2022 06:26 IST

రన్నింగ్‌లో రోబో రికార్డు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇప్పుడు హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌తోపాటు అక్కడక్కడా రోబోలను చూసే ఉంటారు. అచ్చం మనుషుల్లానే ఉండే ఆ రోబోలు.. ఒక్కో అడుగు వేస్తుంటాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రోబో మాత్రం వాటికి భిన్నం. ఇది ఏకంగా పరుగులు తీస్తుంది. రికార్డులూ సృష్టిస్తోంది. మరి ఇంతకీ అసలా రోబో ఏంటో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

అమెరికాలోని ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థుల బృందం తయారు చేసిన ఓ రోబో ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కేసింది. ఇంతకీ ఆ రోబో సాధించిన ఘనత ఏంటంటే.. పరుగు పందెంలో 100 మీటర్ల దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ!

అయిదేళ్ల క్రితం తయారీ..

యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా 2017లో ఓ రోబోను తయారు చేశారు. దానికి ‘మెకనైజ్డ్‌ స్ప్రింటర్‌ కాస్సీ బైపెడల్‌’గా పేరు పెట్టారు. అచ్చం ఆస్ట్రిచ్‌ పక్షిలాగే మోకాళ్లు వంచుతూ నడిచే ఈ రోబోను ముద్దుగా ‘కాస్సీ’ అని పిలుస్తుంటారు. బ్యాటరీ సహాయంతో నడిచే ఈ రోబో గతేడాది యూనివర్సిటీ చుట్టూ దాదాపు 5 కిలోమీటర్ల దూరాన్ని 53 నిమిషాల్లో చుట్టేసిందట. ‘మెషిన్‌ లెర్నింగ్‌’ సాంకేతికత సాయంతో పనిచేసే మొట్టమొదటి బైపెడల్‌ రోబో ఇదేనని అక్కడి ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఆ సమయంలోనే ఈ రోబో అసలు ఎంత వేగంతో పరుగెత్తుతుందో పరీక్షించాలని అనుకున్నారట. దాంతో అప్పటినుంచి ప్రతిరోజూ కాస్సీతో మెట్లు ఎక్కించడం, దించడం చేయసాగారు.

రన్నింగ్‌ ట్రాక్‌పైన రికార్డు

యూనివర్సిటీ ఆధ్వర్యంలో గత మే నెలలో 100 మీటర్ల రన్నింగ్‌ ట్రాక్‌పైన ఈ రోబో వేగాన్ని పరీక్షించారు. అయితే, అనూహ్యంగా 24.73 సెకన్లలోనే అది వంద మీటర్లను విజయవంతంగా పూర్తి చేసింది. ‘రోబోతో పరిగెత్తించడం అంత కష్టం కాదనీ, కాకపోతే.. రన్నింగ్‌ పూర్తి అయ్యే వరకూ దాన్ని నిలబెట్టి ఉంచడమే పెద్ద సమస్య’ అని ప్రొఫెసర్లు చెబుతున్నారు. ట్రాక్‌పైన రోబో పరుగెత్తే సమయంలో ఎటువంటి కెమెరాలు కానీ, సెన్సార్లు కానీ ఉపయోగించలేదట. కేవలం సాంకేతికత సహాయంతోనే ఈ ప్రయత్నం చేశారు. ఈ ఘనతను ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతిధులు కూడా పరిశీలించి.. ఇటీవలే అధికారికంగా ధ్రువపత్రం కూడా అందించారు. రోబోల పనితీరుకు సంబంధించి అనేక రికార్డులు ఉన్నా.. అచ్చం మనిషిలా రన్నింగ్‌ రేస్‌లో పాల్గొని, పరుగు ప్రారంభించిన చోటికే తిరిగి చేరుకోవడం విశేషమని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

కాస్సీ రన్నింగ్‌ రేస్‌కు సంబంధించిన వీడియోను ఇటీవల యూనివర్సిటీ వాళ్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దాంతో తక్కువ సమయంలోనే అది వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరేమో హాలీవుడ్‌ సినిమాలతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగా భలే రోబో కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని