Published : 07 Oct 2022 00:51 IST

భలే భలే పప్పీలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పెంపుడు జంతువులంటే చాలామందికి సరదాగానే ఉంటుంది. ఒకరిద్దరికి మాత్రం వాటికి తినిపించడం, బయటకు తీసుకెళ్లడం, స్నానం తదితరాలు చేయించడం అంతగా నచ్చదు. అటువంటి వారికోసమే వచ్చేశాయి ఈ రోబో పప్పీలు. వినడానికి కాస్త వింతగా ఉన్నా, పెంపుడు జీవులంటే ఇష్టం ఉండీ.. వాటి నిర్వహణ భారంగా భావించే వారి కోసమేనన్నమాట. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా..

చైనాలోని ప్రముఖ నగరాలైన షాంఘై, బీజింగ్‌ వీధుల వెంట మీరు ఉదయం, సాయంత్రాలు వెళ్లారంటే.. ఎక్కడో ఒక చోట రోబో కుక్కలు వాకింగ్‌ చేస్తూ కనిపిస్తాయి. వెంట వాటి యజమానులు ఉంటారనుకోండి.. కుక్కల్లో అనేక జాతులు, లక్షణాలు ఉంటాయని తెలుసు కానీ ఈ రోబోవి ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ!

యువతరం ఎక్కువగా..

ఇటీవల చైనాలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో ఈ రోబో కుక్కలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వీటిని ఎక్కువగా అక్కడి యువత ఇష్టపడుతున్నారట. ఎందుకంటే, వీటికి తినిపించనవసరం లేదు.. స్నానం చేయించనక్కర్లేదు.. టీకాల ఊసే ఉండదు.. ఒక్కమాటలో చెప్పాలంటే వీటికి ఏమాత్రం నిర్వహణ అవసరం లేదన్నమాట. పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్నా.. వాటికి ప్రత్యేకంగా సమయం కేటాయించలేని వారు, ఇప్పుడు తమకు తగినట్లు ఉండే రోబో పప్పీలపైన ఆసక్తి చూపుతున్నారట.

తలపైన కెమెరా..  

అలాగని, ఈ మర కుక్కలను తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్‌.. వీటిలో జీవం లేకపోయినా, మామూలు పప్పీల్లానే ఇవి యజమాని వెంటే నడవడంతోపాటు కూర్చోగలవు, పరిగెత్తగలవు కూడా. బ్యాటరీతో పనిచేసే ఇవి అయిదు కిలోల వరకూ బరువులు కూడా మోయగలవట. వీటి తల ముందు భాగంలో ఉండే కెమెరాతో ఇవి నడిచే మార్గంలో ఉండే అడ్డంకులనూ చూడగలవు. తమ యజమానులను కూడా గుర్తించగలవట. వీటి ఖరీదు కూడా లక్షన్నర నుంచి రూ.10 లక్షల వరకూ ఉంది. నిర్మాణ నాణ్యత, ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉంటుందట. సగటున వీటి బ్యాటరీ గంట సమయం మాత్రమే వస్తుందట. ఇప్పుడిప్పుడే రోబో పప్పీల వాడకం పెరుగుతోందని, భవిష్యత్తులో ఈ వ్యాపారం కొన్ని బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని అక్కడి ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ పప్పీలను వాకింగ్‌కు తీసుకెళ్తున్న ఫొటోలను కొందరు ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కొద్దిరోజుల్లోనే వైరల్‌గా మారాయి. మన భావాలను వాటితో పంచుకోవడం కుదరకపోయినా, నిజంగా ఈ రోబో కుక్కలు కొత్తగా భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని