Updated : 08 Oct 2022 00:13 IST

అన్నం పెట్టే అమ్మలు.. ఈ యంత్రాలు!

హాయ్‌ నేస్తాలూ...! మనకు ఆకలేస్తే ఏం చేస్తాం... ‘అమ్మా.. ఆకలేస్తోంది’ అని చెబుతాం. అమ్మ మనకు వేడివేడిగా అన్నం వడ్డిస్తుంది. అప్పుడు మనం హాయిగా బొజ్జనిండా తింటాం. ఇప్పుడు ఎలాగూ సెలవులే కాబట్టి తిన్నాక కాసేపు బజ్జుంటాం. మరి పేదల పరిస్థితి ఏంటి.. వాళ్లకు ఆకలేస్తే ఎలా? ఆ సమయంలో వాళ్ల దగ్గర డబ్బులు లేకుంటే ఎలా? ప్చ్‌.. చాలా కష్టం కదూ! కానీ ఓ దేశంలో మాత్రం పేదలు పస్తులు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఆకలేస్తే... ఎంచక్కా ఏటీఎం లాంటి మెషీన్‌లోంచి నచ్చిన ఆహారాన్ని ఉచితంగా తీసుకుని తినొచ్చు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా.

దుబాయిలో ప్రభుత్వమే ఈ బ్రెడ్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. తమ కడుపు నిండేంత వరకు ఎవరైనా.. ఎన్ని సార్లైనా ఈ యంత్రం నుంచి ఆహారం తీసుకుని తినేయొచ్చు. బ్రెడ్‌ ఏటీఎం నుంచి కేవలం బ్రెడ్‌ మాత్రమే కాకుండా, చపాతీ,  ఫింగర్‌ రోల్స్‌ను ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే తీసుకుని హాయిగా తినేయొచ్చు.

ఏడు ప్రాంతాల్లో...
దుబాయి వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేశారు. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, షాపింగ్‌ మాల్స్‌ ఇలా అక్కడక్కడ ఈ బ్రెడ్‌ ఏటీఎంలు ఉన్నాయి. ఈ యంత్రానికున్న టచ్‌స్క్రీన్‌పై మనకు కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే చాలు.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ ఆహారం సిద్ధమై యంత్రం నుంచి బయటకు వస్తుంది. ఆ ఆహారం బయటకు రావడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఎప్పటికప్పుడు ఆ యంత్రం చూపిస్తూనే ఉంటుంది.

పరిమితులు లేవు...
నేస్తాలూ.. మీకు మరో విషయం తెలుసా.. ఒక వ్యక్తికి కేవలం ఇన్ని బ్రెడ్‌లే అనే పరిమితులేమీ లేవు. ఎన్ని అవసరం అయితే అన్ని బ్రెడ్‌లు, చపాతీలు, ఫింగర్‌ రోల్స్‌ ఈ మెషీన్‌ నుంచి ఎంచక్కా తీసుకోవచ్చు. అక్కడి పేద ప్రజలు కూడా ఈ యంత్రాలను దుర్వినియోగం చేయడం లేదు. నిజంగా తమకు ఎంత ఆహారం అవసరమో అంతే చాలా క్రమశిక్షణతో తీసుకుంటున్నారు. ఆకలితో ఉన్నవారికి ఏడాది పొడవునా ఆహారం అందించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ఈ యంత్రాలను నిర్వహిస్తోంది.

విరాళాలూ ఇవ్వొచ్చు..
ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే... ఈ యంత్రాన్ని ఉపయోగించి కానీ, ఆన్‌లైన్‌లో కానీ విరాళాలు ఇవ్వొచ్చు. చాలా మంది స్వచ్ఛందంగా ఈ పథకం కోసం తమకు తోచిన మొత్తాలను సాయంగా అందిస్తున్నారు. పేదలకు అన్నం పెట్టే అమ్మలాంటి ఈ యంత్రాలు భలే ఉన్నాయి కదూ!

ఎవ్వరూ ఆకలితో ఉండొద్దని..
తమ దేశంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని, పస్తులతో పడుకోకూడదని అక్కడి ప్రభుత్వం ఈ యంత్రాలను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ యంత్రాలను కరోనా సమయంలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేని చాలా మంది పేదలకు ఈ యంత్రాలే కడుపు నింపాయి. తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకుంటే చాలు కేవలం 15 నిమిషాల్లోనే సిద్ధమై బయటకు వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని