సేద్యం.. ఇలా ఎలా సాధ్యం!?

హాయ్‌ నేస్తాలూ..! మీకు పంటలు ఎలా పండుతాయో తెలుసా? ఇంకెలా పండుతాయి. భూమి మీద పండుతాయి. మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించి పెరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం నీటి మీద పెరుగుతాయి. ఇది కొత్త విషయమేం కాదు.. కానీ ఈ సాగులో చేపలూ ఉంటాయి.

Published : 18 Oct 2022 01:13 IST

హాయ్‌ నేస్తాలూ..! మీకు పంటలు ఎలా పండుతాయో తెలుసా? ఇంకెలా పండుతాయి. భూమి మీద పండుతాయి. మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించి పెరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం నీటి మీద పెరుగుతాయి. ఇది కొత్త విషయమేం కాదు.. కానీ ఈ సాగులో చేపలూ ఉంటాయి. వాటి వ్యర్థాలనే పోషకాలుగా తీసుకుని మొక్కలు పెరుగుతాయి. ఇదంతా ఎక్కడో విదేశాల్లో అనుకునేరు. కానే కాదు. ఇదంతా మన దేశంలోనే. మరి.. పూర్తి వివరాలు తెలుసుకుందామా!

కర్ణాటక రాజధాని బెంగళూరులో మాధవి ఫామ్స్‌ ఉంది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద ఆక్వాపోనిక్స్‌ ఫామ్‌. ఇలాంటి ఫామ్‌లే భవిష్యత్తులో కీలకం కానున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2050కల్లా ప్రపంచజనాభా 970 కోట్లు దాటనుంది. మనదేశ జనాభా కూడా 170 కోట్లు దాటనుంది. జనాభా పెరుగుతుంది కానీ.. స్థలం మాత్రం పెరగదు కదా. దీంతో భూమికి చాలా డిమాండ్‌ ఏర్పడుతుంది. అలాగే వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తప్పవు. ఈ సమస్యలన్నింటికీ ఆక్వాపోనిక్స్‌ విధానం సరైన పరిష్కారం అని పరిశీలకులు చెబుతున్నారు.

పర్యావరణానికి మేలు..

మాధవి ఫామ్స్‌లో చేస్తున్న ఈ సాగు విధానం వల్ల ప్రకృతికీ ఎంతో మేలు. ఇందులో అసలు ఎరువులు, క్రిమిసంహారకాలు వాడరు. పెద్దపెద్ద నీళ్లట్యాంకుల్లో చేపల్ని పెంచుతారు. నీటి మీద తేలేలా తేలికైన షీట్ల మీద ఆకుకూరలు, కాయగూరల మొక్కల్ని పెంచుతారు. ఈ విధానం వల్ల పర్యావరణానికి అసలేమాత్రం హాని జరగదు. పైగా తక్కువ స్థలంలో ఇటు ఆకుకూరలు, కూరగాయలు, అటు చేపల పెంపకం జరుగుతుంది. భవిష్యత్తులో ఆహార కొరత రాకుండా ఈ విధానం ఎంతో ఉపయోగపడనుంది.

అమ్మోనియా మహిమ...

ఫిష్‌ ట్యాంకు పైన మొక్కల్ని పెంచడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చేపల వ్యర్థాల వల్ల నీళ్లలో అమ్మోనియా శాతం పెరుగుతుంది. ఈ నీళ్లనే మొక్కలు వాడుకుంటాయి. ప్రస్తుతం ఈ ఫామ్‌లో టమోటాలు, పొట్లకాయలు, వంకాయ వంటి కూరగాయలు, ఇంకా పలు రకాల ఆకుకూరల్ని సాగు చేస్తున్నారు. ఈ విధానం వల్ల దాదాపు 90 శాతం నీటి వినియోగం తగ్గుతుంది.

విస్తీర్ణం ఎంతంటే..

భారతదేశంలోనే అతిపెద్దదైన ఈ ఆక్వాపోనిక్స్‌ ఫామ్‌ ఎంత పెద్దగా ఉంటుందో చెప్పనేలేదు కదూ! ఇది దాదాపు అరవైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ రోజూ దాదాపు 200 కిలోల కూరగాయలు వస్తాయి. అలాగే ఈ పద్ధతిలో మొక్కలు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ వేగంగా పెరుగుతాయి. ఇలా పెరిగిన కూరగాయలు, ఆకుకూరల్లో పోషకాలూ ఎక్కువగానే ఉంటాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ భారతదేశంలోనే అతిపెద్ద ఆక్వాపోనిక్స్‌ ఫామ్‌ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని