Published : 06 Nov 2022 00:06 IST

బొమ్మను చేస్తే.. అది మర మనిషైంది!

వయసు పట్టుమని పదేళ్లు లేవు. కానీ ఏకంగా రోబోలే తయారు చేస్తున్నాడు. అవును నేస్తాలూ.. అవును... ఇది నిజంగా నిజం! తరగతి పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో, ఏకంగా రోబోలను తయారు చేస్తున్నాడో బుడతడు. భారతదేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన రోబో మేకర్‌గానూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మరి ఆ చిచ్చర పిడుగు గురించి తెలుసుకుందామా! అయితే ఇంకెందుకాలస్యం, ఈ కథనం చదివేయండి మరి!

కేరళ రాష్ట్రం కోచికి చెందిన సామరాజ్‌ సుమేష్‌ వయసు కేవలం ఎనిమిది సంవత్సరాలు. తనకు అయిదేళ్ల వయసున్నప్పుడే ఓ రోబోను తయారు చేసి అందరితో ఔరా అనిపించుకున్నాడు. తమ కుమారుడి ప్రతిభను నాలుగేళ్ల వయసులోనే  తల్లిదండ్రులు గుర్తించారు. అప్పుడే అతడితో ఏదైనా సరికొత్తగా చేయించాలనుకున్నారు.

నాన్న స్ఫూర్తితో...

అందరూ బొమ్మలతో ఆడుకునే వయసులో సుమేష్‌ రోబో మేకింగ్‌ కిట్‌తో ఆడుకున్నాడు. దాన్ని అమ్మానాన్న చిన్నారికి బహుమతిగా ఇచ్చారు. నాన్న ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈయనే మన సుమేష్‌లో రోబో తయారీపై ఆసక్తి కలిగేలా చేశారు. ఆయన స్ఫూర్తితోనే సుమేష్‌ తన బుజ్జి బుజ్జి చేతులతో రోబోలను తయారు చేస్తున్నాడు.

అమ్మకు సాయం చేయాలని...

సుమేష్‌ తనకు అయిదేళ్ల వయసున్నప్పుడే ఓ బుల్లి రోబోను తయారు చేశాడు. ఇది ఇంటిలో ఫ్లోర్‌ను శుభ్రం చేస్తుంది. రోజూ వాళ్లమ్మ పడే కష్టాన్ని చూసి, ఆమెకు సాయం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేశాడు. తర్వాత రోబోటిక్‌ ట్రైసైకిల్‌, చూపులేనివారి కోసం చేతికర్ర, రోబోటిక్‌ హ్యాండ్‌, డిజిటల్‌ క్లాక్‌, స్మార్ట్‌ సీట్‌ బెల్ట్‌ ఇలా చాలా వస్తువులను, రోబోలను తయారు చేశాడు.

సిలికాన్‌ వ్యాలీలో...

2016లో సిలికాన్‌ వ్యాలీలో జరిగిన ‘మేకర్‌ ఫెయిర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి హాజరైన వాళ్లందరిలోకెల్లా మన సుమేషే అత్యంత పిన్న వయస్కుడు. ఈ చిన్నారి రాజీవ్‌ సర్కిల్‌ ఫెలోషిప్‌ను కూడా అందుకున్నాడు. ప్రపంచంలోకెల్లా అతి పిన్నవయస్కుడైన టెడెక్స్‌ స్పీకర్‌గానూ గుర్తింపు పొందాడు.

హ్యూమనాయిడ్‌ రోబోనూ...

కృత్రిమ మేధ(ఏఐ)తో పని చేసే హ్యూమనాయిడ్‌ రోబోను కూడా మన సుమేష్‌ తయారు చేశాడు. ఇది ప్రతిరోజూ ఈ చిన్నారికి గుడ్‌మార్నింగ్‌ కూడా చెబుతుంది. ఇవన్నీ చేసిన సుమేష్‌ తాను పెద్దయ్యాక ఖగోళ శాస్త్రవేత్తను అవుతానని చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఇన్ని ఘనతలు సాధించిన సుమేష్‌ తాను అనుకున్నది సాధించాలని మనమూ మనసారా కోరుకుందామా. మరి ఇంకేం ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని