Published : 07 Nov 2022 00:06 IST

నేనో విచిత్ర జీవినోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా చిత్రంగా చూస్తున్నారు. కాస్త పిల్లిలా.. ఇంకాస్త ముంగిసలా.. విచిత్రంగా కనిపిస్తున్న నేను ఎవరనా?! నాది ఏ దేశమనా? నాది ఏ విదేశమో కాదు.. నేనుండేది మన భారతదేశంలోనే... మరి నా గురించి తెలుసుకుంటారా..?!

ఇంతకీ నా పేరు చెప్పనేలేదు కదూ! నన్ను అంతా నీలగిరి మార్టెన్‌ అని పిలుస్తారు. నేను దక్షిణ కనుమల్లోని నీలగిరి కొండల్లో మాత్రమే జీవిస్తాను. భారతదేశంలో ఇంకెక్కడా నేను కనిపించను. అంటే మేం చాలా అరుదైన జీవులమన్నమాట. మేం ప్రస్తుతం కేవలం వెయ్యి వరకు మాత్రమే జీవించి ఉన్నాం.

చిరు ప్రాణిని...

మా శరీరం మీద రెండు రంగులుంటాయి. ఒళ్లంతా బ్రౌన్‌ రంగులో ఉంటే, తల కింద కాస్త పసుపు, ఆరెంజ్‌ రంగులో ఉంటుంది. నేను 55 నుంచి 65 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. నా తోకేమో 40 నుంచి 45 సెంటీమీటర్ల వరకు పొడవుంటుంది. నేను దాదాపు రెండు కిలోల వరకు బరువు తూగుతాను.

పచ్చని చెట్లల్లో..

నేను నీలగిరి కొండల్లో పచ్చని చెట్లతో నిండిన అడవుల్లో హాయిగా జీవిస్తాను. నేను కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తుంటాను. ఇంకెక్కడా నేను బతకలేను. కేవలం ఇక్కడ మాత్రమే నేను జీవించేందుకు అనుకూల పరిస్థితులుంటాయి.

చెట్లెక్కగలను..

నేను నేల మీద నడవగలను, చెట్ల మీద కూడా ఉండగలను. నేను చిన్న చిన్న పక్షుల్ని, కీటకాలను, చిరు జీవుల్ని ఆహారంగా తీసుకుంటాను. అలా అని నేను కేవలం మాంసాహారిని మాత్రమే కాదు.. పండ్లు, విత్తనాలను కూడా తింటాను. నేను సాధారణంగా 14 సంవత్సరాల వరకు జీవిస్తాను. మాలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో 18 సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి. మేం ప్రస్తుతం అంతరించిపోయే స్థితిలో ఉన్నాం. మేం నివసించే పరిస్థితులు కేవలం నీలగిరి కొండల్లోనే ఉండటంతోనే మేం చాలా తక్కువ ప్రాంతానికే పరిమితమయ్యాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా గురించిన విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు