ఎంత పెద్ద విమానమో!

హాయ్‌ నేస్తాలూ! పిల్లలమైన మనకు విమానాలంటే బోలెడు ఇష్టం కదూ! మన ఆటబొమ్మల్లోనూ కనీసం ఒక్కటైనా విమానం ఉండాల్సిందే!

Published : 09 Dec 2022 00:59 IST

హాయ్‌ నేస్తాలూ! పిల్లలమైన మనకు విమానాలంటే బోలెడు ఇష్టం కదూ! మన ఆటబొమ్మల్లోనూ కనీసం ఒక్కటైనా విమానం ఉండాల్సిందే! అది సరే.. మీకు ఈ అతిపెద్ద విమానం గురించి తెలుసా! తెలియదా... అలా బుంగమూతి పెట్టుకోకండి. తెలియకున్నా ఫర్లేదు. ఎంచక్కా ఇప్పుడు తెలుసుకోండి.. సరేనా!

చూడ్డానికి రెండింటిలా కనిపిస్తున్నా... నిజానికి ఇది ఒక్క విమానమే. దీని పేరు స్ట్రాటోలాంచ్‌. దీన్ని అమెరికాకు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీని రెక్కల పొడవు దాదాపు 385 అడుగులు ఉంటుంది. అంటే ఏకంగా ఫుట్‌బాల్‌ మైదానాన్ని కవర్‌ చేయగలదు. విమానం పొడవేమో 238 అడుగులుంటుంది. తోక ఎత్తేమో 50 అడుగులు.

ఆరు ఇంజిన్లు...

ఈ భారీ విమానానికి ఆరు టర్బో ఇంజిన్లున్నాయి. ఈ విమానాన్ని బోయింగ్‌ జెట్స్‌ భాగాలతో తయారు చేశారు. ఇది గంటకు దాదాపు 304 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 35,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లగలదు.

ఎందుకు తయారు చేశారంటే...

అది సరే.. ఇంత పెద్ద విమానాన్ని ఎందుకు తయారు చేశారో తెలుసా.. రాకెట్లు, శాటిలైట్లు ప్రయోగించడానికి! అవును. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. నిజంగా నిజం. భూమి మీద నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగించాలంటే కొన్ని అడ్డంకులున్నాయి. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. దీన్ని అధిగమించడం కోసమే ఈ స్ట్రాటోలాంచ్‌ను తయారు చేశారు. నేస్తాలూ మొత్తానికి ఈ బాహుబలి విమానం సంగతులు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని