Updated : 10 Dec 2022 04:22 IST

కారుని మించిన వేగం.. దీని సొంతం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నెమ్మదిగా వెళ్లే వాహనాల్లో రోడ్డు రోలరు తర్వాత మనకు గుర్తొచ్చేది ట్రాక్టరే కదూ! అవి వేగానికి కాకుండా శక్తికి ఉద్దేశించినవి కావడంతోనే అంత నెమ్మదిగా ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రాక్టర్‌ తరహా వాహనం మాత్రం వాటికి భిన్నం. ఈ తరహా వాహనాల వేగంలోనూ ప్రపంచ రికార్డు దీనిసొంతం. ఆ వివరాలేంటో చదివేయండి మరి..
ఇంగ్లండ్‌కు చెందిన ఓ సంస్థ తయారు చేసిన ‘జేసీబీ ఫాస్ట్రక్‌ టూ’ అనే వాహనం స్పోర్ట్స్‌ కారు కంటే వేగంగా ప్రయాణిస్తుందట. ఎంతా అంటే.. గంటకు 247 కిలోమీటర్లు అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో వీళ్లు తయారు చేసిన మోడల్‌కు మరిన్ని మెరుగులు దిద్ది.. దీన్ని తీసుకొచ్చారట.  

వేగంగా ప్రయాణించే ట్రాక్టర్‌  

మనం బయటకు వెళ్లినప్పుడు రోడ్లవెంట ట్రాక్టర్లు, జేసీబీలు కనిపిస్తూనే ఉంటాయి. కార్లు, ఆటోల మాదిరి అవి అంత వేగంగా ప్రయాణించలేవు. ఎందుకంటే వాటిని తయారు చేసిన ఉద్దేశం.. పవర్‌.. అంటే ఎక్కువ శక్తి లేదా బలం అవసరమైన పనులకు మాత్రమే వాటిని ఉపయోగిస్తారన్నమాట. ఒకసారి ఆ ఇంగ్లండ్‌ సంస్థ ప్రతినిధులకు ‘ట్రాక్టర్లు ఎందుకు వేగంగా ప్రయాణించకూడదు?’ అనే సందేహం వచ్చింది. వెంటనే కొందరు ఇంజినీర్లు ఒక బృందంగా ఏర్పడి, వేగంగా ప్రయాణించే ట్రాక్టర్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనలోంచి తయారైందే.. ‘జేసీబీ ఫాస్ట్రాక్‌ టూ’. 7.2 లీటర్‌ ఇంజిన్‌, ఆరు సిలిండర్లు కలిగిన ఈ ట్రాక్టర్‌ అత్యధికంగా గంటకు 247 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. ‘అదేంటి.. జేసీబీ ఫొటో పెట్టి, ట్రాక్టర్‌ అంటారు?’ అని అనుమానంగా చూస్తున్నారా - తయారీదారుల ఉద్దేశంలో జేసీబీలు కూడా సాంకేతికంగా ట్రాక్టర్ల కోవకే చెందుతాయి.

అంత సులభం కాదు..

అంత కష్టపడి తయారు చేసిన ఆ ట్రాక్టర్‌ సుమారు అయిదు టన్నుల బరువు ఉంది. అయితే, ఇంత బరువు ఉన్న వాహనాన్ని అంత వేగంతో ప్రయాణించేలా చేయడం సులభం కాదంటున్నారు ఇంజినీర్లు. దానికోసం ఎంతో కష్టపడి, డిజైన్‌ను కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అయితే, దీనికంటే ముందు తయారు చేసిన ఓ ట్రాక్టర్‌ గంటకు కేవలం 166 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించిందట. ఇప్పుడు దానికి అడ్వాన్స్‌డ్‌ మోడల్‌తో ఆ సంస్థ రికార్డును వారే తిరగరాశారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ‘వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ ట్రాక్టర్‌’ విశేషాలు.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు