Published : 13 Dec 2022 00:31 IST

రికార్డుల తాబేలు..!

 

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం మన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులను, బంధువులను పిలుచుకొని కేక్‌ కట్‌ చేస్తాం కదా! అలాగే, ఇటీవల ఓ తాబేలు పుట్టినరోజును కూడా ఘనంగా సెలబ్రేట్‌ చేశారు. ‘అందులో కొత్త ఏముంది?’ అని అంటారా - ఉంది నేస్తాలూ.. అది గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన తాబేలు మరి.. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

అట్లాంటిక్‌ సముద్ర తీరంలో సెయింట్‌ హెలెనా అనే ఐలాండ్‌ ఒకటి ఉంది. అక్కడ జొనాథన్‌ అనే తాబేలు చాలా ఏళ్లుగా నివసిస్తోంది. ఇటీవల అది 190వ పుట్టినరోజు జరుపుకొంది. మీరు చదివింది నిజమే నేస్తాలూ.. ప్రపంచంలోనే అతి వృద్ధ తాబేలు ఇదేనట. ఈ మాట నేను చెప్పడం లేదు.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులే తేల్చారు.

రెండు రికార్డులు.. 

రెండు ప్రపంచ యుద్ధాలు, 39 మంది అమెరికా అధ్యక్షుల పాలనాకాలాలను చూసిందీ తాబేలు. ఇంకో విషయం ఏంటంటే.. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే దీని వయసే పెద్దది. గిన్నిస్‌ బుక్‌ ప్రకారం ఇది 1832వ సంవత్సరంలో పుట్టింది. కానీ, అది అంతకుముందే జన్మించి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక గిన్నిస్‌ రికార్డు ఉంటేనే ఉంతో గొప్పగా చెబుతుంటాం. ఈ జొనాథన్‌ పేరిట మాత్రం రెండు రికార్డులు ఉన్నాయి. భూమిపైన నివసించే జీవులతోపాటు ఆ జాతి జంతువుల్లోనూ ఇదే అత్యంత ఎక్కువ వయసున్నదట.

కూరగాయలతో కేకు..

తాబేలు పుట్టినరోజు వేడుకలను ఆ ఐలాండ్‌ గవర్నర్‌ బంగళా ఆవరణలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలను అక్కడి పర్యాటక శాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. తాబేలుకు ఇష్టమైన కూరగాయలతో కేకును తయారు చేసి మరీ.. దాంతో కోయించారట. ప్రపంచ రికార్డు సాధించిన జొనాథన్‌ తమ ప్రాంతంలో ఉండటం వారు గర్వంగా భావిస్తున్నారు. అందుకే, జొనాథన్‌ పేరిట ఒకరోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలనీ, ఏటా ఆరోజు వేడుకలు నిర్వహించేలా అక్కడి పాలకులు చర్చలు జరుపుతున్నారట.

చూపు మందగించినా..

మనుషులకైనా, జంతువులకైనా వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది కదా! ఈ తాబేలుది కూడా అదే పరిస్థితి అట. జొనాథన్‌కు ప్రస్తుతం చూపు లేదని, వాసన చూసే శక్తి కూడా కోల్పోయిందని దాని సంరక్షకులు చెబుతున్నారు. అయినా కూడా తన వినికిడి శక్తితోనే హాయిగా బతికేస్తుందట. ఇవండీ.. ఈ రికార్డుల తాబేలు విశేషాలు..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని