Updated : 31 Dec 2022 05:32 IST

చూపు లేకున్నా.. ప్రతిభలో మిన్న!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు మంచి మంచి దుస్తులు, పౌష్టికరమైన ఆహారం, రవాణా సదుపాయం.. ఇలా అన్నీ ఉన్నా కూడా స్కూలుకు వెళ్లాలంటే మారాం చేస్తుంటాం. చదువుతోపాటు ఇంకేదైనా అదనంగా నేర్చుకోమని పెద్దవాళ్లు చెబితే బద్ధకిస్తుంటాం. కానీ, హరియాణాలోని ఓ అంధ పాఠశాల విద్యార్థులు మాత్రం వీటన్నింటికీ భిన్నం. చదువుకు వైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నారు. ఆ వివరాలేంటో చదివేయండి మరి..

పానీపత్‌లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను నిర్వహిస్తోంది. హరియాణాలో ఉన్న ఏకైక అంధుల స్కూల్‌ ఇదేనట. ఇక్కడ దాదాపు 150 మంది చదువుకుంటున్నారు. వారిలో 50 మంది అమ్మాయిలు, 100 మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. వీరంతా చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ అద్భుత ప్రతిభ చూపుతున్నారట.

ఆసక్తి మేరకు..

మనకు చిన్న దెబ్బ తగిలితేనే అది మానిపోయేవరకూ విలవిల్లాడిపోతాం. అలాంటిది.. ఇక్కడి విద్యార్థులు మాత్రం తమలోని అంగవైకల్యాన్ని అధిగమిస్తూ, అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. పానీపత్‌లోని అంధ పాఠశాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ సంగీతం, క్రీడలు, టెక్నాలజీ, కుట్లు, అల్లికలు.. ఇలా వారికి ఆసక్తి ఉన్న ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధిస్తున్నారు. వీరికి చదువు చెప్పేందుకు 16 మంది ఉపాధ్యాయులు ఉంటే, వారిలో ఆరుగురు అంధులే కావడం విశేషం. ఒకరిద్దరైతే అదే పాఠశాలలో చదువుకొని, ప్రస్తుతం అక్కడే టీచర్లుగా పాఠాలు చెబుతున్నారు.

యూట్యూబ్‌ ఛానల్‌ కూడా..

ఈ బడిలో పదో తరగతి విద్యార్థి అమన్‌ బాగా చదువుకోవడంతోపాటు సంగీతం నేర్చుకుంటున్నాడు. ఏడో తరగతిలో ఇక్కడ చేరిన ఈ నేస్తం.. తబలా, కీబోర్డు, హార్మోనియం చక్కగా వాయించగలడట. అంతేకాదు.. సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా నిర్వహిస్తున్నాడు. మూడు వేల మంది సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారట. భవిష్యత్తులో పెద్ద గాయకుడు కావాలనుకుంటున్నట్లు అమన్‌ చెబుతున్నాడు. ఇదే స్కూల్‌లో చదువుతున్న చింటుకి చిన్నప్పటి నుంచి చెస్‌ అంటే ఇష్టం. ఇక్కడికొచ్చాక ఆటపైన మంచి పట్టు సాధించాడు. త్వరలో జరగబోయే జాతీయ అంధుల టోర్నమెంట్‌లోనూ పాల్గొననున్నాడు. మరో విషయం ఏంటంటే.. ఈ బడిలో చదివిన విద్యార్థుల్లో 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారట. కొందరు బ్యాంకుల్లో, మరికొందరు లెక్చరర్లుగా స్థిరపడ్డారని స్కూల్‌ ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు. నేస్తాలూ.. నిజంగా వీరందరూ చాలా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని