ఉందామా.. ఉన్నంతలో ఉన్నతంగా!

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే కేరింతలు, ఆనందాలు, ఉత్సాహాలు, కేకులు ఇవే గుర్తుకు వస్తాయి కదా! చూస్తుండగానే 2022 వెళ్లిపోయింది.

Updated : 01 Jan 2023 05:13 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌! మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే కేరింతలు, ఆనందాలు, ఉత్సాహాలు, కేకులు ఇవే గుర్తుకు వస్తాయి కదా! చూస్తుండగానే 2022 వెళ్లిపోయింది. 2023 వచ్చేసింది. మరి ఈ కొత్త సంవత్సరంలో మనమూ కొత్తగా మారదామా.. మనల్ని మనం మార్చుకుందామా.. అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.


నేస్తాలూ... మీకు ‘పంచతంత్రం’ కథలు తెలుసు కదా! అవన్నీ భలే ఉంటాయి కదూ! ఎంచక్కా మనకు నీతిని పంచుతాయి. ‘అది సరే ఇప్పుడు వాటి ప్రస్తావన ఎందుకు?’ అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. ‘పంచతంత్రం’లానే మనం ఇకపై ‘పంచమంత్రం’ పాటిద్దాం సరేనా! ఓ అయిదు సూత్రాలు పాటిస్తూ మనల్ని మనం మెరుగుపరుచుకుందామా మరి!


ఆరోగ్యమే మహాభాగ్యం!

పంచమంత్రంలో అన్నింటి కన్నా ముఖ్యం ఆరోగ్యం. ‘మా చిన్న పిల్లల్లో పుష్కలంగా ఇమ్యూనిటీ ఉంటుందట కదా! కరోనా విషయంలో డాక్టర్లు, సైంటిస్టులు చెప్పారు కదా! మా ఆరోగ్యానికి ఇంకేం ఢోకా లేదు’ అని మీరనుకుంటారేమో! కచ్చితంగా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తేనే మనకు మంచిది. రాత్రి త్వరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్రలేవాలి. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. రోజూ చక్కగా స్నానం చేయాలి. దంతాలను శుభ్రం చేసుకోవాలి. గోర్లు చిన్నగా ఉండేలా చూసుకోవాలి. జంక్‌ఫుడ్‌ తగ్గించాలి. అస్సలు తినకపోతే ఇంకా మంచిది. కింద పడ్డ వస్తువుల్ని తీసుకుని నోట్లో పెట్టుకోకూడదు. అదే పనిగా చెవుల్లో, ముక్కుల్లో, నోట్లో వేళ్లు పెట్టుకోకూడదు. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.


పుస్తకమే మన నేస్తం!

మనకు సరదాలు ఎంత ముఖ్యమో... చదువు అంతకంటే ప్రధానం. మన భవిష్యత్తును నిర్ణయించేది అదే. అందుకే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, టీవీ చూడటం చాలా వరకు తగ్గించాలి. రోజూ చదువుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. ఫోన్‌ చూస్తూ, టీవీ చూస్తూ హోం వర్క్‌ చేయడం, చదువుకోవడంలాంటివి అస్సలు చేయొద్దు. దీని వల్ల ఏకాగ్రత కుదరదు. తరగతి గదిలో అల్లరి చేయకుండా ఉపాధ్యాయులు చెప్పేవి శ్రద్ధగా వినాలి. తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుని చదవాలి. తరగతి పుస్తకాలకే పరిమితం కాకుండా మహానుభావుల జీవిత చరిత్రల్లాంటివీ చదవాలి. చిత్రకళ, సంగీతం ఇలా కళల మీద ఆసక్తి ఉంటే అవీ నేర్చుకోవాలి.


పచ్చనిదనమే పచ్చదనమే!

మీరు ఇప్పటికే ప్రతి పుట్టిన రోజుకు ఓ మొక్కను నాటి సంరక్షిస్తున్నారు కదూ! లేకపోతే ఈ సంవత్సరం నుంచైనా పాటించండి సరేనా! కేవలం పుట్టిన రోజునే కాకుండా నూతన సంవత్సరం సందర్భంగా కూడా ఈ రోజు ఓ మొక్కను నాటండి. ఒక వేళ ఈ రోజే మీ పుట్టిన రోజు అనుకోండి... ఇంకేం.. నూతన సంవత్సరం సందర్భంగా ఓ మొక్క, మీ పుట్టిన రోజు సందర్భంగా మరో మొక్క నాటండి. ఇలా మనం ప్రతి సంవత్సరం ఓ రెండు మొక్కల్ని నాటి, వాటి ఆలనాపాలనా చూడాలి. మన కుటుంబసభ్యులు, మిత్రులు, బంధువులనూ ఈ దిశగా ప్రోత్సహించాలి.


చీమే ఆదర్శం!

మనకంటే ఎన్నోరెట్లు చిన్నదైన చీమను మనం పొదుపు విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి. వేసవిలో, శీతాకాలంలో అది సేకరించిన ఆహారాన్ని దాచుకుని వానాకాలంలో వాడుకుంటుంది. దాని ముందుచూపు వల్ల అది ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడుపుతుంది. అలాగే మనం కూడా ఇప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి. అమ్మానాన్న, బంధువులు మనకు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులు వృథా చేయకుండా కిడ్డీ బ్యాంకులో దాచుకోవాలి. అవసరం అయితే దీనికో పుస్తకాన్నీ పెట్టాలి. ఏ రోజున ఎంత మొత్తం కిడ్డీబ్యాంకులో వేశామో ఆ పుస్తకంలో రాసుకోవాలి. దీని వల్ల మన పొదుపు మీద మనకు అవగాహన వస్తుంది. ఇలా పోగైన డబ్బులతో మనకు ఏమైనా పనికివచ్చే వస్తువులను కొనుక్కోవచ్చు. స్నేహితుల పుట్టినరోజులకు బహుమతులూ కొనొచ్చు. మధ్యలో మనకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అవసరం అయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులను వాడుకోవచ్చు. అలా డబ్బులు తీసుకున్నప్పుడు పుస్తకంలో తీసుకున్న మొత్తం, కారణాన్ని కూడా రాసుకోవాలి. దీని వల్ల మనకు పొదుపు అలవడుతుంది. అమ్మానాన్న కూడా మనల్ని బాగా మెచ్చుకుంటారు.


ఇదే ప్రధానం..  

పంచమంత్రాల్లో చివరిది. కానీ ఇదే ప్రధానమైనది. క్రమశిక్షణ, వినయం లేకుంటే ఎన్ని చేసినా వృథానే. అందుకే మనం వీటిని కచ్చితంగా అలవర్చుకోవాలి. పెద్దలను గౌరవించాలి. అమ్మానాన్న చెప్పింది వినాలి. అల్లరి తగ్గించుకోవాలి. మారాం మానేయాలి. కుక్కలు, పిల్లుల్లాంటి పెంపుడు జంతువులను హింసించి మనం ఆనందం పొందకూడదు. పైగా అవి కరిస్తే మనకు చాలా ప్రమాదం. అప్పుడప్పుడు పేదలకు సాయం చేస్తుండాలి. తరగతిలో కానీ, బయట కానీ ఎవ్వరినీ వెక్కిరించకూడదు. ఆటపట్టించకూడదు. అనుమతి లేకుండా వేరేవారి వస్తువులను తాకకూడదు. బస్సులో, రైలులో, విమానంలో ప్రయాణించేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా అరవకూడదు.


ఇవన్నీ మనలో చాలా మందికి ముందే తెలిసిన విషయాలే అయి ఉండొచ్చు. కానీ ఇక నుంచి ఈ విధానాలను పాటించే ప్రయత్నం చేద్దాం... ఉన్నంతలోనే ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. గుడ్‌ బాయ్‌, గుడ్‌ గర్ల్‌గా మంచి పేరు తెచ్చుకుందాం... సరేనా! అన్నింటికన్నా ముఖ్యం ఏంటంటే... చాక్లెట్లు మరీ ఎక్కువ తినకుండా.. కొన్నే తిందాం.. ఏమంటారు నేస్తాలూ! అలాగే.. మీ అందరికీ మరోసారి ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని