Published : 06 Jan 2023 00:43 IST

అట్టముక్కలతో మహా నగరం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మీకు లండన్‌ నగరం చూడాలని ఉందా? - అయితే, పాస్‌పోర్టు, వీసా అవసరం లేకుండానే.. ఎంచక్కా అక్కడి ప్రముఖ కట్టడాలను వీక్షించొచ్చు. ‘అదెలా?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ.. అదే మరి మ్యాజిక్కు. అట్టముక్కలతో ఓ అన్నయ్య ఏకంగా లండన్‌ నగర నమూనాని రూపొందించాడు. మరి ఆ ఉత్తుత్తి నగరం విశేషాలేంటో తెలుసుకుందామా..!
పంజాబ్‌కు చెందిన గుర్దీప్‌ సింగ్‌ అనే అన్నయ్యకు చిన్నప్పటి నుంచి లండన్‌ వెళ్లి, అక్కడే స్థిరపడాలనే కోరిక ఉండేది. కానీ, వీసా తదితర కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నిరుత్సాహమే ఎదురైంది. దీంతో తనకు తెలిసిన కళను ఉపయోగించి.. అట్టముక్కలతో ఏకంగా లండన్‌ నగరాన్నే నిర్మించాడు. ఆ నమూనాలను చూసిన వారంతా అవాక్కవుతున్నారు.

వెలుగులతో మరింత అందం

ఈ అన్నయ్య చిన్నతనం నుంచి వివిధ నగరాలు, స్టేడియాల నమూనాలను తయారు చేసేవాడు. ఆ ఆసక్తితోనే కేవలం అట్టముక్కల సాయంతో లండన్‌లోని ముఖ్యమైన భవనాలు, రహదారులు, రైల్వేస్టేషన్‌, పర్యాటక ప్రాంతాలను అద్భుతంగా నిర్మించాడు. వీటన్నింటిలోకెల్లా బ్రిడ్జిని ఎంతో ముచ్చటగా రూపొందించాడు. నీళ్ల వల్ల నిర్మాణం దెబ్బతినకుండా అట్టలకు పైన ఇనుప పలకలను అమర్చాడు. వాటికి అలంకరించిన రంగురంగుల దీపాలు మరింత అందం తీసుకొచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే.. సిటీలో టూరిస్టులను ఎంతగానో ఆకర్షించే ఈ బ్రిడ్జికి రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను అమర్చాడు. బటన్‌ నొక్కగానే బ్రిడ్జి విడిపోవడం, మళ్లీ కలవడం జరుగుతుంది.

మూడున్నరేళ్ల కష్టం

ఏదైనా నమూనా రూపొందించాలంటే.. ముందుగా దాని గురించి పూర్తిగా తెలిసుండాలి. అందుకే, ఈ అన్నయ్య కూడా యూట్యూబ్‌లో లండన్‌ నగర వీడియోలు చూసి, గూగుల్‌ సాయంతో అక్కడి మార్గాలను పరిశీలించి మరీ ఎంతో హోంవర్క్‌ చేశాడట. అధ్యయనం నుంచి నిర్మాణం పూర్తి చేసేవరకూ మొత్తం మూడున్నరేళ్ల సమయం పట్టిందట. దాదాపు రూ.50 వేల వరకూ ఖర్చయింది. మొదట్లో కాస్త తికమకపడినా.. అక్కడ నివసించే స్నేహితులు, బంధువుల సహాయంతో పూర్తి చేయగలిగానని చెబుతున్నాడు. అంతేకాదు నేస్తాలూ.. త్వరలోనే ఈ లండన్‌ నగర నమూనాను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తాడట. దీన్ని చూస్తే లండన్‌ను నేరుగా చూసిన అనుభూతి పొందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిజమే కదా ఫ్రెండ్స్‌.. ఈ నమూనాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు