విఘ్నేశ్‌ ఎత్తు.. ప్రత్యర్థుల చిత్తు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. దాదాపు మన అందరి ఇళ్లలో చెస్‌ బోర్డులు ఉండే ఉంటాయి. ఆలోచన శక్తి పెరుగుతుందనో, సరదా కోసమో తరచూ మనం ఆడుతూనే ఉంటాం.

Updated : 11 Jan 2023 05:57 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. దాదాపు మన అందరి ఇళ్లలో చెస్‌ బోర్డులు ఉండే ఉంటాయి. ఆలోచన శక్తి పెరుగుతుందనో, సరదా కోసమో తరచూ మనం ఆడుతూనే ఉంటాం. కానీ, ఓ నేస్తం మాత్రం ప్రత్యేక ఆసక్తితో చదరంగంలో మెలకువలు నేర్చుకొని మరీ సత్తా చాటుతున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో బోలెడు అవార్డులు కొల్లగొడుతున్నాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...!

మిళనాడు రాష్ట్రంలోని శివగంగై ప్రాంతానికి చెందిన విఘ్నేశ్‌కు ప్రస్తుతం 12 సంవత్సరాలు. ఇటీవల స్థానికంగా జరిగిన చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించడంతోపాటు రూ.51 వేల నగదు బహుమతి కూడా పొందాడు. ఇదొక్కటే కాదు నేస్తాలూ.. గతంలోనూ జిల్లా, రాష్ట్ర స్థాయి బహుమతులు అనేకం గెలుచుకున్నాడు.

ఆరేళ్ల వయసు నుంచే..

విఘ్నేశ్‌ తండ్రి దినసరి కూలీగా, తల్లి నర్సుగా పనిచేస్తున్నారు. పేద కుటుంబమే అయినా ఇంట్లో ఆటల విషయంలో ఎంతో ప్రోత్సహించేవారు. అలా ఈ నేస్తం ఆరేళ్ల వయసు నుంచే చెస్‌ ఆడటం ప్రారంభించాడు. అయిదుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్‌ ఆనందే తనకు స్ఫూర్తి అని చెబుతున్నాడు. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ అకాడమీలో చేరి.. చెస్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అంతేకాదు.. విఘ్నేశ్‌ వాళ్ల అన్నయ్య కూడా చెస్‌ క్రీడాకారుడే కావడంతో తన సహాయంతో ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. అలాగని చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. నిత్యం తరగతులకు హాజరవుతూనే.. ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటలపాటు చెస్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇక సెలవు రోజుల్లోనైతే.. చకచకా హోంవర్క్‌ పూర్తి చేసుకొని, ఆటలోనే మునిగిపోతాడట.

జాతీయ స్థాయిలో ఆడాలని..

మొదటిసారిగా అండర్‌-7 విభాగంలో జిల్లా స్థాయి పోటీల్లో తొలి విజయాన్ని అందుకున్నాడు విఘ్నేశ్‌. అదే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనే చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌లో క్రీడా సంబంధిత వీడియోలు చూసి, ఆ సమయాన్ని కూడా తన ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు సద్వినియోగం చేసుకున్నాడు. గతేడాది జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌-12 పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచాడు. అండర్‌-13 విభాగంలో మూడో స్థానం సాధించాడు. త్వరలోనే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, అక్కడా సత్తా చాటడమే తన లక్ష్యమని చెబుతున్నాడీ నేస్తం. మరి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని