నేను అతి పే..ద్ద అరటినోచ్‌!

హాయ్‌ఫ్రెండ్స్‌.. మీకు అరటి పండంటే భలే ఇష్టం కదూ! అందుకే మిమ్మల్ని పలకరించిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. ఇంతకీ నేనెవర్నో చెప్పలేదు కదూ!

Published : 29 Jan 2023 00:15 IST

హాయ్‌ఫ్రెండ్స్‌.. మీకు అరటి పండంటే భలే ఇష్టం కదూ! అందుకే మిమ్మల్ని పలకరించిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. ఇంతకీ నేనెవర్నో చెప్పలేదు కదూ! ప్రపంచంలోనే అతిపెద్ద అరటిచెట్టు రకాన్ని. మరి నా విశేషాలు తెలుసుకుంటారా!

నా పేరు ముసా ఇన్‌గెన్స్‌. నన్ను జెయింట్‌ హైలాండ్‌ బనానా అని కూడా పిలుస్తారు. 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాను. నేను 300 పండ్ల వరకు కాస్తాను. వాటి బరువు దాదాపు 60 కిలోల వరకు ఉంటుంది. నాకు కాసే అరటిగెల పొడవు ఏకంగా 15 మీటర్ల వరకు ఉంటుంది. మామూలుగా అరటిపండ్లు ఏడు అంగుళాల వరకూ పెరగగలవు. కానీ నా చెట్టుకు కాసేవి మాత్రం 11.8 అంగుళాల వరకూ పెరుగుతాయి.

ఒక్కచోటే...!

నేను ఎక్కడబడితే అక్కడ పెరగను. అందుకే మీరెవ్వరూ నన్ను ఇప్పటి వరకు చూసి ఉండరు. నేను కేవలం న్యూగినియాలోని పర్వతప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాను. సముద్రమట్టానికి 1300 నుంచి 2000 మీటర్ల ఎత్తులో నేను జీవించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులుంటాయి. నిజానికి నేనో ప్రకృతి వింతను. ఎందుకంటే మీరు అరటిచెట్టు అని అయితే అంటారు కానీ, నేను నిజానికి చెట్టును కాదు. ఎందుకంటే నాలో కలప ఉండదు. పొరల్లాంటి నిర్మాణాలే ఉంటాయి. అయినా దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాను. దృఢంగానూ ఉంటాను. తుపానుల్లాంటి ప్రకృతి విపత్తులనూ తట్టుకునే ప్రయత్నం చేస్తాను.

సరిగ్గా డజను...!

నాకు సరిగ్గా 12 పత్రాలుంటాయి. ఇవి ఆరు మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. నాకు కాసే పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. కాస్త పసుపు వర్ణంలో గుజ్జు ఉంటుంది. వాటిలో నలుపు, బూడిద రంగులో విత్తనాలూ ఉంటాయి. వీటి నుంచే ఇతర మొక్కలు వస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి.. నా దగ్గర మీరు నిల్చుంటే ఎలా ఉంటారో! అచ్చం లిల్లీపుట్లలానే కనిపిస్తారు కదూ!

చల్లని వాతావరణం ఉండాలి..

నేను పెరగాలంటే చల్లని వాతావరణం ఉండాలి. అలా అని నీడ ఉంటే కష్టం. ఎండ కూడా ఉండాలి. ఇలాంటి అరుదైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే నేను పెరుగుతాను. ఇలాంటి అనుకూల పరిస్థితులు కేవలం న్యూగినియాలోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. మమ్మల్ని ఇతర ప్రాంతాల్లోనూ పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి అనుకున్నంత ఫలితాలను మాత్రం ఇవ్వడం లేదంట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా గురించిన విశేషాలు.. ఇక ఉంటా మరి బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని