పక్షుల కోసం.. రికార్డు దాసోహం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పక్షులన్నా, పెంపుడు జంతువులన్నా బోలెడు ఇష్టం కదూ! ఎండాకాలం వస్తే మన ఇంటి ఆవరణలోనో, డాబా మీదనో పక్షుల ఆకలితోపాటు దప్పిక తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లూ చేస్తుంటాం.

Updated : 21 Feb 2023 00:26 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు పక్షులన్నా, పెంపుడు జంతువులన్నా బోలెడు ఇష్టం కదూ! ఎండాకాలం వస్తే మన ఇంటి ఆవరణలోనో, డాబా మీదనో పక్షుల ఆకలితోపాటు దప్పిక తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లూ చేస్తుంటాం. అయితే, ఓ అన్నయ్య మాత్రం ఏకంగా రికార్డు సాధించేంత పెద్ద బర్డ్‌ ఫీడర్‌ను నిర్మించాడు. ఆ అన్నయ్య ఎవరో, ఆ విశేషాలేంటో గబగబా చదివేయండి మరి..

మహారాష్ట్రకు చెందిన హరేష్‌ షా అనే అన్నయ్య 2014 వరకూ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఆ పని మానేసిన తర్వాత.. సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ, పక్షుల గూళ్లు విక్రయించే వ్యాపారం ప్రారంభించాడు. పదో వందో కాదు.. ఏకంగా 700 కేజీల దాణాను ఉంచగలగడంతోపాటు ఒకేసారి 108 పక్షులు తినగలిగే సామర్థ్యం ఉన్న ఫీడర్‌ను నిర్మించాడు. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద బర్డ్‌ ఫీడర్‌గానూ దీనికి గుర్తింపు లభించింది. ఈ ఘనత సాధించిన షా అన్నయ్య ఇటీవలే అధికారికంగా గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు.

పక్షుల సంఖ్యను చూసి..

మొదట తన పొలంలో పక్షుల ఆకలి తీర్చేందుకు రెండు దాణా డబ్బాలను అమర్చాడు. ప్రతి రోజూ ఆహారం కోసం వచ్చే వాటి సంఖ్య పెరుగుతుండటంతో.. డబ్బాల సంఖ్యను కూడా పెంచుతూ వెళ్లాడు షా అన్నయ్య. అయితే, ఒకరోజు అసలు ప్రపంచంలోనే అతిపెద్ద బర్డ్‌ ఫీడర్‌ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందోననే ఆలోచన అతడికి వచ్చింది. వెంటనే ఇప్పటికే ఆ రికార్డు ఎవరి పేరిట ఉందోనని గూగుల్‌లో వెతికాడు. 345 కేజీల దాణాను ఉంచగలిగే ఫీడర్‌తో అమెరికాలోని వర్జీనియాకు చెందిన గ్రీనే అనే వ్యక్తి పేరిట గిన్నిస్‌ రికార్డు ఉందని గుర్తించాడు. తాను అంతకంటే పెద్దది ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.

రీసైక్లింగ్‌ వస్తువులతో..

పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా రీసైకిల్‌ చేసిన వస్తువులతో ఓ పెద్ద కంటైనర్‌ను తయారు చేయించాడీ అన్నయ్య. పక్షులు కూర్చొని దాణా తినేందుకు వీలుగా ఏర్పాట్లూ చేయించాడు. ఈ మొత్తానికి దాదాపు రూ.3.8 లక్షలు వెచ్చించాడట. ఎరిక్‌ సొల్హెమ్‌ అనే వ్యక్తి ఇటీవలే గిన్నిస్‌ రికార్డు అందుకున్న షా అన్నయ్య ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. స్వతహాగా పక్షి ప్రేమికుడైన ఈ అన్నయ్యకు ప్రపంచ గుర్తింపు దక్కడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడట. పక్షుల కోసం ప్రతిరోజూ 300 కేజీల వరకూ దాణాను కొనుగోలు చేస్తున్నానని చెబుతున్నాడు. మూగజీవాల ఆకలి తీరుస్తున్న ఈ అన్నయ్య నిజంగా చాలా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని