క్వాక్‌... క్వాక్‌... నా పేరే భాష!!

హాయ్‌ ఫ్రెండ్స్‌. బాగున్నారా...! నేనో పక్షిని. నా పేరు భాష. అంటే ఓ భాష పేరే నా పేరని!! సరే కాసేపు నా పేరు సంగతి పక్కన పెడితే..! నా తీరు కూడా విచిత్రంగానే ఉంటుంది.

Published : 22 Feb 2023 00:34 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌. బాగున్నారా...! నేనో పక్షిని. నా పేరు భాష. అంటే ఓ భాష పేరే నా పేరని!! సరే కాసేపు నా పేరు సంగతి పక్కన పెడితే..! నా తీరు కూడా విచిత్రంగానే ఉంటుంది. చూడ్డానికి రంగులతో భలే కనువిందు చేస్తాను. మరి నా సంగతులేంటో... విశేషాలేంటో తెలుసుకుంటారా!

నేను బాతును. నా పేరు మాండరిన్‌ డక్‌. మాండరిన్‌ అనేది చైనా భాష అని తెలుసు కదా మీకు. మేం ఒకప్పుడు తూర్పు ఆసియాలో పెద్ద సంఖ్యలో కనిపించేవాళ్లం. కానీ అడవుల నరికివేత వల్ల ప్రస్తుతం కేవలం రష్యా, చైనా, జపాన్లలో మాత్రమే జీవిస్తున్నాం. మా సంఖ్య చాలా తక్కువ. మేం కేవలం వేలల్లోనే ఉన్నాం.

చిరుజీవులం....

మేం 41 నుంచి 49 సెంటీమీటర్ల పొడవుంటాం. రెక్కలు కలుపుకొని 65 నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఉంటాం. మేం కాస్త ఉత్తర అమెరికాకు చెందిన ఉడ్‌ డక్‌లా ఉంటాం. మా బరువు కూడా తక్కువే. మాలో మగవి 0.63 కిలోగ్రాములుంటే, ఆడవేమో సుమారు ఒక కేజీ వరకు ఉంటాయి.

మగవే రంగుల్లో...  

నిజానికి మాలో మగవే రంగురంగులతో అందంగా ఉంటాయి. ముక్కు కూడా ఎర్రగా ఉంటుంది. ఆడవి మాత్రం తెలుపు, బూడిదరంగులో ఉంటాయి. ముక్కు నలుపు రంగులో ఉంటుంది. అయినప్పటికీ ఇవి కూడా అందంగానే ఉంటాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాత్రం ఆడ, మగ రెండూ ఒకేలా ఉంటాయి.

మాకు సిగ్గెక్కువ!

ఇతర బాతులతో పోల్చుకుంటే మాకు సిగ్గు ఎక్కువ. ముఖ్యంగా మీ మనుషులు కనిపిస్తే చాలు.. మేం దూరంగా పారిపోతాం. కానీ అలవాటు పడితే మాత్రం పెంపుడు జీవుల్లా ఏ బెరుకూ లేకుండా ఉండగలం.

డజను గుడ్లు

మాలో ఆడవి ఒక్కసారికి 12 వరకు గుడ్లను పెడతాయి. అది కూడా ఏప్రిల్‌, మే మధ్యలో మాత్రమే పెడతాయి. తర్వాత వాటిని పొదుగుతాయి. వీటిలోంచి పిల్లలు బయటకు వచ్చాక.. అవి తల్లినే అనుసరిస్తాయి. తినడం, ఈత నేర్చుకుంటాయి.

ఏం తింటామంటే...

ఇంతకీ మేం ఏం తింటామో చెప్పలేదు కదూ! నత్తలు, పురుగులు, చిన్న చిన్న చేపలు, కప్పలు, పాముల్ని ఇష్టంగా తింటాం. ధాన్యాలు, విత్తనాలు, నీటి మొక్కలనూ తినగలం. ముంగిసలు, నీటికుక్కలు, అడవి పిల్లులు, గుడ్లగూబలు, పాములు మాకు ప్రధాన శత్రువులు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని