సైన్స్‌ అంటే మాకిష్టం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. గణితం తర్వాత మనమంతా కష్టంగా భావించే సబ్జెక్ట్‌ సైన్స్‌. కొందరికి బోలెడు ఆసక్తి కలిగించినా, చాలామందికి మాత్రం సైన్స్‌లో లెక్కలేనన్ని సందేహాలు వస్తుంటాయి.

Updated : 07 Mar 2023 00:38 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. గణితం తర్వాత మనమంతా కష్టంగా భావించే సబ్జెక్ట్‌ సైన్స్‌. కొందరికి బోలెడు ఆసక్తి కలిగించినా, చాలామందికి మాత్రం సైన్స్‌లో లెక్కలేనన్ని సందేహాలు వస్తుంటాయి. అందుకే, ఓ టీచర్‌.. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా ఆ సబ్జెక్టును బోధిస్తున్నారు. విద్యార్థులతో సొంతంగా ప్రాజెక్టులు చేయిస్తూ.. అవార్డులూ సాధిస్తున్నారు.

ఆ వివరాలే ఇవీ..

తమిళనాడు రాష్ట్రంలోని కమ్మాన్‌గఢ్‌ ప్రభుత్వ పాఠశాలలో మైథిలి అనే సైన్స్‌ టీచర్‌ 2014 నుంచి పనిచేస్తున్నారు. ఈ బడికి వచ్చిన కొత్తలో విద్యార్థుల్లో చాలామంది సైన్స్‌ సబ్జెక్టు అంటే భయపడటం గమనించారామె. దాంతో ఎలాగైనా వారిలో ఆ భయం పోగొట్టాలని అనుకున్నారు. అందుకు సంగీతాన్ని సాధనంగా ఉపయోగించుకున్నారు. అంటే.. సైన్స్‌ పాఠాలను కథలు, పాటలు, పద్యాలతో ముడిపెట్టి విద్యార్థులకు చెప్పడం ప్రారంభించారు.

ప్రాజెక్టులూ.. అవార్డులూ..

ప్రతిరోజూ తరగతిలో విద్యార్థులకు పాఠం చెప్పడానికి ముందు.. దానికి సంబంధించిన ఒక కథను చెప్పేవారు మైథిలి టీచర్‌. అది విన్న తర్వాత అసలైన పాఠం వారికి సులభంగా అర్థం అవుతుందని ఆమె ఆలోచన. ఎలాగైనా సైన్స్‌పైన శ్రద్ధ పెంపొందించి, పిల్లలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆన్‌లైన్‌లో దొరికే వివిధ పరికరాల సాయంతో పుస్తకంలోని అంశాలను దృశ్యరూపకంగా వివరించేవారు. కేవలం పాఠాలు చెప్పడమే కాదు.. పోటీలకూ హాజరయ్యేలా విద్యార్థులను ఆమె తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ‘మూవింగ్‌ సోలార్‌ ప్యానెల్‌’, ‘బ్లూటూత్‌ స్పీకర్‌’, ‘హార్ట్‌బీట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’, ‘పవర్‌ జనరేషన్‌ ఫ్రం సీ వేవ్స్‌’, ‘పేపర్‌ రీసైక్లింగ్‌ మెషీన్‌’ తదితర ప్రాజెక్టులను పిల్లలతో తయారు చేయించారు. అందుకుగాను 2018 నుంచి 2022 వరకూ ఏటా రాష్ట్రస్థాయి అవార్డులను దక్కించుకున్నారామె.

ఉపకార వేతనాలకు ఎంపిక

ఈ పాఠశాల నుంచి 14 మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలు పొందుతున్నారు. మైథిలి టీచర్‌ శిక్షణ ఇవ్వడంతోనే గతంలో జరిగిన పరీక్షలో ప్రతిభ చూపి, నగదు ప్రోత్సాహకానికి ఎంపికయ్యామని ఆ విద్యార్థులు చెబుతున్నారు. 2020లో నిర్వహించిన ఓ గిన్నిస్‌ రికార్డు కార్యక్రమంలో ఈ స్కూల్‌ నుంచి దాదాపు 23 మంది విద్యార్థులు పాల్గొన్నారట.

భయం.. పరార్‌..

ఆన్‌లైన్‌ క్లాసుల సమయంలో ఈ టీచర్‌ గ్రామంలోని ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి, సందేహాలను నివృత్తి చేస్తూ.. వారిలో పరీక్షల భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కేవలం బోధనలోనే కాకుండా సామాజిక బాధ్యతగా.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారీ టీచర్‌. ప్లాస్టిక్‌ వల్ల అనర్థాలను వివరిస్తూ.. సొంత ఖర్చులతో గ్రామంలోని ప్రతి ఇంటికీ కాగిత సంచులను పంపిణీ చేశారట. తాను రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు ఎంపికైనట్లు బాలమురుగన్‌ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి సంబరపడిపోతున్నాడు. ‘మొదట్లో నాకు సైన్స్‌ అంటే భయం ఉండేది.. మైథిలి టీచర్‌ వచ్చాక, ఇప్పుడు నాకు అది ఇష్టమైన సబ్జెక్టుగా మారిపోయింది’ అని అభినయ అనే విద్యార్థిని చెబుతోంది. నేస్తాలూ.. మొత్తానికి ఈ స్కూల్‌ విద్యార్థులకు సైన్స్‌ అంటే ఏమాత్రం భయం లేదన్నమాట. అంతే కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు