కడవంత కారు!

ఏంటి నేస్తాలూ... అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు! ‘పడవంత కారు’ కదా అనాలి.. ‘కడవంత కారు’ అంటున్నారేంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదూ! ఇది చాలా చాలా చిన్న కారు మరి.

Updated : 05 May 2023 00:41 IST

ఏంటి నేస్తాలూ... అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు! ‘పడవంత కారు’ కదా అనాలి.. ‘కడవంత కారు’ అంటున్నారేంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదూ! ఇది చాలా చాలా చిన్న కారు మరి. దీనిలో కేవలం ఒక్కరే ప్రయాణించగలరు. అది కూడా నడిపే వ్యక్తి రెండు చేతులూ సగానికి పైగా బయటే ఉంటాయి. ఇక స్టీరింగు సంగతి సరేసరి! ఇంతకీ ఆ కారేంటో? దాని పేరేంటో.. తీరేంటో? తెలుసుకోవాలని ఉంది కదూ! అయితే, ఇంకెందుకాలస్యం ఎంచక్కా ఈ కథనం చదివేయండి.

ఇంగ్లండ్‌కు చెందిన జెర్మీ క్లార్క్‌సన్‌ ఈ కడవంత కారును డిజైన్‌ చేశారు. దీనికి పీ-45 అని పేరు పెట్టాడు. ఇది పీల్‌ పీ-50 అనే మూడు చక్రాల కారు కన్నా కూడా చిన్నగా ఉంటుంది. దీన్ని ప్రపంచంలోనే అతి బుజ్జి కారుగా క్లార్క్‌సన్‌ చెబుతున్నారు. ఈ కారు లెగోలతో తయారు చేసిన ఆస్ట్రోనట్‌లా కనిపిస్తుంది.

చక్రాలు నాలుగు...

ఈ పీ-45 కారుకు నాలుగు చక్రాలుంటాయి. డోర్లు మాత్రం ఉండవు. కారు నడిపే వ్యక్తికి సీట్‌ బెల్ట్‌ ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈ కారు బాడీనే కవచంలా ఉంటుంది. తలకు హెల్మెట్‌ లాంటి విండ్‌షీల్డ్‌ ఉంటుంది. దీనికి వైపర్లు గట్రా ఏమీ ఉండవు. స్టీరింగ్‌ కూడా బయటే ఉంటుంది. కవచంలోంచి చేతులు బయట పెట్టుకొని స్టీరింగ్‌తో ఈ కారును నడపాల్సి ఉంటుంది.

వేగం ఎంతంటే...

ఈ బుజ్జి పీ-45 కారు గంటకు సుమారు 48.28 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై పరుగులు పెడుతుంది. ఇక ఇందులో కేవలం 1.70 లీటర్ల ఇంధనం మాత్రమే పడుతుంది. ఈ కారు కూడా పెద్దగా బరువుండదు. చాలా తేలికగా ఉంటుంది. దీనికున్న మరో ప్రత్యేకత ఏంటంటే... ఈ కారులోంచి దిగకుండానే నడిపే వ్యక్తే స్వయంగా ఇంధనం నింపుకోవచ్చు. ఈ కారు లిఫ్ట్‌లోనూ పడుతుంది. చూడటానికైతే భలే ఫన్నీగా ఉంటుంది కానీ... దీన్ని నడపడం మాత్రం అంత సౌకర్యంగా ఉండదు. నేస్తాలూ మొత్తానికి ఇవీ కడవంత కారు విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని