ముందరి కాళ్లు ఒకలా.. వెనకవి మరోలా..!
హాయ్ నేస్తాలూ.. మనకు చాలా రకాల జంతువుల గురించి తెలుసు. వాటిలో కొన్నింటికి నాలుగు, మరికొన్నింటికి ఆరు.. ఇలా ఎన్ని కాళ్లున్నా, అన్నీ ఒకేలా ఉంటాయనీ తెలుసు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే జీవి మాత్రం అందుకు భిన్నం.
హాయ్ నేస్తాలూ.. మనకు చాలా రకాల జంతువుల గురించి తెలుసు. వాటిలో కొన్నింటికి నాలుగు, మరికొన్నింటికి ఆరు.. ఇలా ఎన్ని కాళ్లున్నా, అన్నీ ఒకేలా ఉంటాయనీ తెలుసు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే జీవి మాత్రం అందుకు భిన్నం. రెండు కాళ్లు ఒకలా.. ఇంకో రెండు మరోలా ఉన్న ఆ జంతువు విశేషాలేంటో చదివేయండి మరి..!
సిల్కీ యాంటీటర్ జీవులు దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని పిగ్మీ యాంటీటర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ జాతిలో మొత్తం ఎనిమిది రకాలుంటే.. ఇవే అన్నింటికంటే చిన్నవి. ఈ జీవుల ప్రత్యేకత ఏంటంటే.. ముందర ఉండే రెండు కాళ్లు కాస్త పొట్టిగా, వాటికి ఒక్కో పదునైన గోరు ఉంటుంది. వెనక కాళ్లు మాత్రం కాస్త పొడవుగా ఉంటాయి. వీటికి గోళ్లలాంటివి ఉండవు కానీ చెట్లు ఎక్కి, దిగే సమయంలో పట్టు కోసం పాదాలు కాస్త వెడల్పుగా ఉంటాయి.
శరీరమంత తోక..
ఈ సిల్కీ యాంటీటర్ జీవులు చాలా చిన్నవి. 36 నుంచి 45 సెంటీమీటర్ల వరకూ పెరుగుతాయి. అందులోనూ తోకే దాదాపు 17 నుంచి 24 సెంటీమీటర్లు ఉంటుందట. అంటే శరీరం ఎంతుంటుందో.. వాటి తోక కూడా దాదాపు అంతే. బరువు సుమారుగా 175 నుంచి 400 గ్రాములు తూగుతాయి. ఈ జీవుల శరీరం లేత పసుపు వర్ణంతో మెరిసిపోతుంటుంది. వీటిలో వేరే రకం జీవుల శరీరం మీద గోధుమ రంగు చారలు కలిగి, పాదాల అడుగు భాగం ఎరుపు రంగులో ఉంటుంది.
పురుగులే ఆహారం
ఈ జీవులు పురుగులను, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. పగటి వేళల్లో కంటే ఎక్కువగా రాత్రి సమయాల్లోనే ఇవి ఆహారాన్వేషణకు వెళ్తుంటాయి. ఆ క్రమంలో వాటి కాళ్లను అందుకు అనుగుణంగా మార్చుకుంటాయి. ఏవైనా పెద్ద జంతువులు వీటిపై దాడికి ప్రయత్నిస్తే, ముందరి కాళ్లకున్న గోళ్లతో ఎదురుదాడి చేస్తాయట. చలి నుంచి రక్షణ కోసం వీటి శరీరంపైన మెత్తని జుట్టు దట్టంగా ఉంటుంది. నేస్తాలూ.. ఈ యాంటీటర్ విశేషాలు భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.