ఈ ఇల్లు ప్రకృతికి నేస్తం!

ప్రపంచం ప్లాస్టిక్‌మయమై పోయింది! కాలువలు, నదులు, సముద్రాలు ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే పాగా వేసింది. పర్యావరణానికి దీని వల్ల ఎంతో కీడు జరుగుతోంది. ఎన్నో జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.

Updated : 07 May 2023 06:42 IST

ప్రపంచం ప్లాస్టిక్‌మయమై పోయింది! కాలువలు, నదులు, సముద్రాలు ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే పాగా వేసింది. పర్యావరణానికి దీని వల్ల ఎంతో కీడు జరుగుతోంది. ఎన్నో జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ సంచులతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఓ అంకుల్‌ దీనికో చక్కని పరిష్కారం చూపించాడు. అదేంటంటే..

ఇండోనేషియాలోని బాలిలో నివసించే గ్యారీ బెంచెగిబ్‌ ఒక పర్యావరణ వేత్త. ఈయన కొంత కాలంగా ఇండోనేషియాలో నదులను పరిరక్షించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ‘సుంగై వాచ్‌’ పేరుతో ఓ ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టాడు. టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలను నదుల నుంచి వెలికితీయడానికి కృషి చేస్తున్నాడు. ప్రజలను ఎంతగా చైతన్య పరుస్తున్నా... ఈ ప్లాస్టిక్‌ సమస్య తీరడం లేదని ఓ చిన్న ఆలోచన చేశాడు.

మార్పు కోసం...

పర్యావరణానికి నష్టం కలుగుతోందని, కేవలం బాధ పడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదనుకున్నాడు. ఒక ఆలోచనతో అందరిలోనూ మార్పు తీసుకురావాలనుకున్నాడు. తాను సేకరించిన దాదాపు 35,000 పై చిలుకు ప్లాస్టిక్‌ సంచులను రీసైక్లింగ్‌ చేయించాడు. వీటితో తయారు చేసిన అచ్చులతో ఆయన ఓ బుజ్జి ఇంటిని నిర్మించాడు. పూర్తైన తన ఇంటి వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఈ ఇంటి వీడియోను చూసి చాలామంది ఆ అంకుల్‌ని అభినందిస్తున్నారు. అందరూ ఇలా ఆలోచిస్తే ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు.

వంద శాతం పర్యావరణ హితం...

ప్లాస్టిక్‌ సంచుల వ్యర్థాలతో తయారైన ఈ 12 చదరపు మీటర్ల ఇంటిలో చాలా సౌకర్యాలున్నాయి. వంట గది, పడకగది, స్నానాల గది వంటి సౌకర్యాలున్నాయి. ఈ ఇంటిని పూర్తి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో దీనికి సోలార్‌ ప్యానల్స్‌ అమర్చాడు గ్యారీ అంకుల్‌. దీని ద్వారానే ఇంటికి కావాల్సిన విద్యుత్తు వస్తోంది. పనిలో పనిగా తాను కూడా ఎలక్ట్రిక్‌ బైక్‌నే వాడుతున్నాడు. మనం అనుకోవాలి కానీ.. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అద్భుతాలు చేయొచ్చని చెబుతున్నాడీయన. ఈ ఇల్లు కేవలం ఓ ప్రయోగం మాత్రమే అని.... తన ఇంటిని ఆదర్శంగా తీసుకుని ప్రకృతి విపత్తుల సమయంలో శరణార్థుల కోసం తక్కువ ఖర్చుతో పెద్ద సంఖ్యలో ఇళ్లను తయారు చేయొచ్చని చెబుతున్నాడు. మొత్తానికి ప్లాస్టిక్‌ సంచుల వ్యర్థాలతో ఇంటిని నిర్మించడం బాగుంది కదూ! మనం కూడా సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిద్దాం.. సరేనా నేస్తాలూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని