చిన్ని రెక్కల చిన్నారిని... పొట్టికాళ్ల పొన్నారిని..!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా...! నేనో చిన్ని బాతును. ‘ఓస్‌.. అంతేనా!’ అనకండి. ఎందుకంటే ఏ బాతుకూ లేని ఓ ప్రత్యేకత నాకుంది తెలుసా...! అదేంటో మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 09 May 2023 05:34 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా...! నేనో చిన్ని బాతును. ‘ఓస్‌.. అంతేనా!’ అనకండి. ఎందుకంటే ఏ బాతుకూ లేని ఓ ప్రత్యేకత నాకుంది తెలుసా...! అదేంటో మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

య్యో... నా మతిమండ. ఇంతకీ నా పేరేంటో మీకు చెప్పనే లేదు కదూ! నన్ను లిటిల్‌ గ్రేబ్‌ అంటారు. డబ్‌చిక్‌ అని కూడా పిలుస్తారు. నేను కేవలం 23 నుంచి 29 సెంటీమీటర్లు ఉంటానంతే. నా రెక్కలు కూడా చిన్నవే.. 40 నుంచి 45 సెంటీమీటర్ల పొడవు ఉంటాయంతే. ఇక బరువంటారా... కేవలం 130 నుంచి 230 గ్రాముల వరకు ఉంటాను. నా కాళ్లు కూడా చాలా పొట్టిగా ఉంటాయి. పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు జీవిస్తాను.

మూడు ఖండాల్లోనూ....

నేను మంచినీటి పక్షిని. చెరువులు, కొలనుల్లో బతికేస్తా. యూరప్‌లో ఎక్కువగా కనిపిస్తాను. తర్వాత ఆసియా, ఆఫ్రికాలోనూ జీవిస్తాను. ఏ ప్రాంతాల్లో అయితే శీతాకాలంలో నీరు గడ్డకడుతుందో... అక్కడి నుంచి మాత్రం వలసపోతాను. నేను చాలా చలాకీగా ఉంటాను. చక్కగా ఈదుతాను. నేలమీద మాత్రం... ప్చ్‌... వేగంగా నడవలేను. కానీ గాల్లో మాత్రం ఎగరగలను. మరో విషయం కేవలం ఈతే కాదు... నేను ఎంచక్కా నీటిలో డైవ్‌ కూడా చేయగలను.

కరకరలాడించేస్తా..!

నా ఆకారాన్ని చూసి చిరుజీవని అలుసుగా చూడకండి. నేను చక్కగా వేటాడగలను. నీటిలోపలకు డైవ్‌ చేసి చేపల్ని వెంటాడి మరీ వేటాడతా. నేను చిన్న పక్షిని కాబట్టి మరీ పెద్ద చేపల్ని తినలేను. అది వేరే విషయం అనుకోండి. చేపలతో పాటు ఇతర చిన్న చిన్న జలచరాలను కూడా కరకరలాడించేస్తా. అయినా మీకేం తెలుసు... పెద్ద చేపల కన్నా... చిన్న చేపల్నే వేటాడటం చాలా కష్టమని!

బురిడీ కొట్టిస్తా....

అవును నేను నా గురించి చెబుతూ పోతుంటే... మీరు చక్కగా వింటున్నారు కానీ... నా ప్రత్యేకత ఏంటో అడగడం లేదేంటి? అసలు నేను వచ్చిందే అది చెబుదామని కదా నేస్తాలూ! సరే... మీరు అడగకున్నా... నేనే చెబుతానులే. దాదాపు పక్షులన్నీ చెట్ల మీదో, స్తంభాల మీదో.. ఇలా ఏదైనా ఎత్తైన ప్రాంతంలో గూళ్లు కట్టుకుంటాయి. నేలమీద కూడా గూడు కట్టుకునే పక్షులు కొన్ని ఉన్నాయనుకోండి. నేను మాత్రం హాయిగా నీటిమీదే గూడు కట్టుకుంటా. ఆ తేలియాడే గూడు మీదే గుడ్లూ పెడతా. వాటిని పొదుగుతా.. ఎంచక్కా అందులోంచి నా పిల్లలు బయటకు వస్తాయి. చెరువులో ఉండే చెట్ల కొమ్మలు, ఆకులు, చెత్తతో నేను గూడు తయారు చేస్తాను. శత్రువుల నుంచి రక్షణ కోసమే ఇదంతా. నేను ఎప్పుడన్నా గూడు వదిలి బయటకు వెళ్లాల్సి వస్తే... గూడులోని గుడ్ల మీద ఆకులను కప్పేస్తా. అప్పుడు నా గూడు.. నీటి మీద తేలుతున్న చిన్ని చెత్తకుప్పలానే కనిపిస్తుంది. కాబట్టి శత్రువులు గుర్తించలేవు. హమ్మయ్య.. నేనొచ్చిన పనైపోయింది. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి...
బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని