ఆకాశంలో ప్రకాశం!

హాయ్‌ ప్రెండ్స్‌.... నేనో పక్షిని. మామూలు పక్షిని కాదు. ముక్కు, రెక్కలు ఎంతో అందంగా ఉండే పక్షిని. నిజానికి ముక్కు, రెక్కలు మాత్రమే కాదు... నా శరీరం కూడా నెమలిని పోలిన రంగులతో ఉంటుంది.

Updated : 15 May 2023 04:02 IST

హాయ్‌ ప్రెండ్స్‌.... నేనో పక్షిని. మామూలు పక్షిని కాదు. ముక్కు, రెక్కలు ఎంతో అందంగా ఉండే పక్షిని. నిజానికి ముక్కు, రెక్కలు మాత్రమే కాదు... నా శరీరం కూడా నెమలిని పోలిన రంగులతో ఉంటుంది. ఇంతకీ నా పేరేంటి? నా ప్రత్యేకతలు ఏంటో తెలుసా...? ప్చ్‌... మీకు తెలియదు కదూ! ఏం ఫర్లేదు.. అవి మీకు చెప్పిపోదామనే, ఇదిగో ఇలా... రెక్కలు కట్టుకుని వచ్చి మరీ మీ ముందు వాలాను.

నా పేరు పర్పుల్‌ గల్లినుల్‌. నేను ఉత్తర, దక్షిణ అమెరికాల్లో జీవిస్తాను. నేను కొంగలాంటి పక్షిని. నేను పర్పుల్‌- బ్లూ రంగులో, నా ముక్కు లేత ఎరుపు రంగులో ఉండి, ముందు కాస్త లేత పసుపు రంగు కూడా ఉంటుంది. ముక్కు మీద, తలపై భాగంలో గుండ్రంగా బొట్టులా కూడా ఉంటుంది. ఇంకా నా కాళ్లేమో సన్నని పుల్లల్లా, పసుపురంగులో కనువిందు చేస్తాయి. రెక్కలు కూడా చక్కని ఈకలతో అందంగా కనిపిస్తాయి. మేం చక్కగా ఎగరగలం కానీ, చాలా ఎక్కువ దూరాలకు మాత్రం ప్రయాణించలేం.


రెక్కలున్న మెరుపును..

నేను 26 నుంచి 37 సెంటీమీటర్ల పొడవుంటాను. రెక్కల పొడవేమో 50 నుంచి 61 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇక బరువు విషయానికొస్తే మాలో మగవి 305 గ్రాముల వరకు బరువుంటాయి. ఆడవి మాత్రం 215 గ్రాముల బరువు తూగుతాయి. మాకు పర్పుల్‌- బ్లూ కలగలిసిన రంగులో ఈకలుంటాయి. అందుకే నేను పగటి పూట మెరిసిపోతుంటాను. నా ఈకల మీద పడ్డ కాంతి తిరిగి పరావర్తనం చెందడం వల్ల నేను ప్రకాశవంతంగా, మెరుస్తూ కనిపిస్తాను. రాత్రిపూట మేం కాస్త బూడిద రంగులో అగుపిస్తాం. మా పిల్లలు మాత్రం నల్ల రంగులో, కాస్త కోడిపిల్లల్లానే ఉంటాయి. వాటి కాళ్లు కూడా బూడిద వర్ణంలో ఉంటాయి. పెరిగే కొద్దీ పసుపు రంగులోకి మారతాయి.


తేలిగ్గా నడిచేలా..

మా కాలి వేళ్లు చాలా పొడవుగా ఉంటాయి. ఇవి నీటిలో ఉన్నప్పుడు వేగంగా, పడిపోకుండా నడిచేందుకు ఉపయోగపడతాయి. నేను ఎక్కువగా చేపలు, కప్పలు, నత్తలు, వానపాములు, లార్వాలు, సాలీడు పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాను. ఇంకా విత్తనాలు, మొక్కల ఆకులు, పండ్లనూ, ఇతర పక్షుల గుడ్లనూ తింటాను. మాలో ఆడవి అయిదు నుంచి పది వరకు గుడ్లను పెడతాయి. కానీ చివరికి ఒకటో, రెండో పిల్లలు మాత్రమే పెరిగి పెద్దవవుతాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. బై.. బై...!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని