పురుగు కొంచెం.. మోత ఘనం!

హలో ఫ్రెండ్స్‌.. చీమలు తమ శరీర బరువు కంటే కొన్ని రెట్ల అధిక బరువులను మోసుకెళ్లగలవని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అదే మనలాంటి మనుషులైతే రెండు, మహా అయితే మూడు రెట్ల ఎక్కువ బరువును మోయగలరు.

Updated : 30 May 2023 05:13 IST

హలో ఫ్రెండ్స్‌.. చీమలు తమ శరీర బరువు కంటే కొన్ని రెట్ల అధిక బరువులను మోసుకెళ్లగలవని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అదే మనలాంటి మనుషులైతే రెండు, మహా అయితే మూడు రెట్ల ఎక్కువ బరువును మోయగలరు. సాధారణంగా శరీర బరువు ఎంత ఎక్కువుంటే.. మోయగలిగే సామర్థ్యం అంత అధికంగా ఉంటుందని అనుకొంటారు. కానీ, ఓ చిన్నజీవి మాత్రం అందుకు భిన్నంగా.. తనకంటే వెయ్యిరెట్లకు పైగా అధిక బరువు మోయగలదట. ఆ వివరాలే ఇవి..

ఆర్బాటిడ్‌ మైట్‌ అనే ఓ చిన్న కీటకం తన శరీర బరువు కంటే 1,180 రెట్ల అధిక బరువును సునాయాసంగా మోయగలదని శాస్త్రవేత్తలు ఇటీవల తమ పరిశోధనల్లో తేల్చారు. అలాగని.. ఆ కీటకమేదో భారీగా ఉంటుందనుకోకండి నేస్తాలూ.. అది కేవలం 0.2 నుంచి 1.4 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. 100 మైక్రోగ్రాముల బరువే తూగుతుంది. కంటికి కూడా స్పష్టంగా కనిపించని ఈ జాతి జీవులు.. అంత శక్తివంతమైనవి మరి.

డొప్పలోనే గొప్పంతా..!

మనకంటే రెట్టింపు బరువైన బస్తానో, ఇంకేదైనానో మోస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే మన దగ్గర కనిపించే పేడ పురుగులైతే వాటి బరువు కంటే 400 రెట్లు ఎక్కువ మోయగలవు. కానీ, ఈ ఆర్బాటిడ్‌ మైట్‌ జీవుల బయటి శరీరంపైన అత్యంత దృఢంగా ఉండే డొప్పలాంటి నిర్మాణం ఉంటుంది. అది ఇతర జీవుల్లో ఉండే ఎముకల కంటే తక్కువ బరువు ఉంటూ, పదుల రెట్లు శక్తివంతమైందట. దాని సహాయంతోనే ఇసుక రేణువంత పరిమాణంలో ఉండే ఈ జీవులు దాదాపు వెయ్యిరెట్లకుపైగా బరువును తీసుకెళ్లగలవట. ఆ లెక్కన చూస్తే.. ఒక సగటు మనిషి 82 టన్నుల బరువును మోయడమన్నమాట.  

సైన్స్‌ కూడా..

ఆర్బాటిడ్‌ మైట్‌ జీవులు సూక్ష్మంగా కాకుండా మనిషంత బరువు ఉంటే.. వాటి సామర్థ్యం భారీగా తగ్గిపోతుందట. ఎందుకూ అంటే.. మన కండరాల్లోని బలంలో అధిక శాతం శరీర బరువును నియంత్రించేందుకే ఖర్చవుతుందట. ఈ జీవులు చిన్నగా ఉండటంతో వాటిలోని కండరాలకు ఆ శ్రమ ఉండదు. దాంతో పూర్తి సామర్థ్యాన్ని బరువులు ఎత్తేందుకే వినియోగిస్తుందన్నమాట. ఈ సైన్స్‌ సంగతులనూ శాస్త్రవేత్తలే వివరిస్తున్నారు.

నేలకు నేస్తాలు!

వానపాముల్లాగానే ఈ ఆర్బాటిడ్‌ మైట్‌ జీవులూ భూమికి మేలే చేస్తాయట. ఎలాగంటే.. మట్టిలోని సూక్ష్మ పోషకాలను మరింత చిన్న భాగాలుగా విభజిస్తూ, భూమిని సారవంతంగా మారుస్తాయి. మానవుల ఆరోగ్యానికి, మొక్కల పెరుగుదలకు హాని చేసే కీటకాల పనిపడతాయి కూడా. అందుకే, భూసారాన్ని పెంపొందించే ఈ చిరుజీవులను భూమికి హితకారులుగా చెబుతున్నారు. నేస్తాలూ.. ఈ బుజ్జి కీటకాలను చూస్తుంటే ‘పిట్ట కొంచెం.. పట్టు ఘనం’ అని అనిపిస్తోంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని