వయ్యారి వారధి !

ఎంతో ఎత్తులో ఉండే వారధి... వంపులవంపుల వంతెన... విడిపోయే బ్రిడ్జ్‌... ఇలా చాలా రకాల వంతెనలుంటాయి... కానీ ఓ దగ్గర భలే చిత్రంగా ఉంది... ఎలాగుందో? ఎక్కడుందో? చదివేస్తే పోలా?!అటో నగరం ఇటో నగరం. మధ్యలో నదీ ప్రవాహం. మరి ఇటు నుంచి అటు వెళ్లాలంటే ఎలా? అందుకే దానిపై ఓ వంతెన కట్టారు. ఎంచక్కా పాదచారులు నడుచుకుంటూ వెళతారు. సైకిళ్లు, చిన్న వాహనాలు రయ్యిమంటూ తిరిగేస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది.

Published : 25 Jul 2019 00:17 IST


ఎంతో ఎత్తులో ఉండే వారధి... వంపులవంపుల వంతెన... విడిపోయే బ్రిడ్జ్‌... ఇలా చాలా రకాల వంతెనలుంటాయి... కానీ ఓ దగ్గర భలే చిత్రంగా ఉంది... ఎలాగుందో? ఎక్కడుందో? చదివేస్తే పోలా?!

అటో నగరం ఇటో నగరం. మధ్యలో నదీ ప్రవాహం. మరి ఇటు నుంచి అటు వెళ్లాలంటే ఎలా? అందుకే దానిపై ఓ వంతెన కట్టారు. ఎంచక్కా పాదచారులు నడుచుకుంటూ వెళతారు. సైకిళ్లు, చిన్న వాహనాలు రయ్యిమంటూ తిరిగేస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది. మరి కిందున్న నీళ్లలో పడవలు వెళితే? ఎలా? దానికి బ్రిడ్జ్‌ అడ్డుగానే ఉంటుంది కదా!
* అలాంటప్పుడే ఈ వంతెన ఒక్కసారిగా పైకి వెళ్లిపోతుంది. ఆర్చ్‌లా అవుతుంది. మళ్లీ పడవలు వెళ్లాక కిందికి వంగిపోయి మామూలు బ్రిడ్జ్‌లా మారిపోతుంది.
* ఇలా ఎలా అంటే... వంతెన రెండు భాగాలుగా ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ ఆరు మీటర్ల పొడవైన స్టీలు తీగలు ఉంటాయి. వీటి సాయంతోనే ఇదీ పైకీ కిందకీ వంగుతూ ఉంటుందన్నమాట.
* దీని పేరు గేట్స్‌హెడ్‌ మిలీనియం. ప్రపంచంలోనే ఏకైక టిల్టింగ్‌ బ్రిడ్జ్‌గా దీనికి పేరు.
* ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదూ! ఇంగ్లండ్‌లోని గేట్స్‌హెడ్‌, న్యూకాజిల్‌ నగరాల మధ్య టైన్‌ అనే నదిపై.
* 105 మీటర్ల పొడవుతో ఉండే ఇది కదిలే వంతెనల్లో ఓ రకం. 2001లో వినూత్నమైన పద్ధతులతో దీన్ని నిర్మించారట. అప్పట్లో అంతర్జాతీయ బ్రిడ్జ్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ నుంచి అద్భుతమైన నిర్మాణంగా అవార్డూ తెచ్చుకుంది.
* ప్రయాణాలకు తగ్గట్టు ఇది మూసుకుపోతూ తెరుచుకుపోతూ భలే గమ్మత్తుగా కనిపిస్తుంటుంది. అందుకే దీనిపై ఎక్కడానికే కాదు. చూడ్డానికీ సరదాగా పర్యటకులు వస్తుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని