ఈల వేసి టైం చెప్తుంది !

ఆవిరి పొగలు కక్కుతుంది... భలేగా ఈలలూ వేస్తుంది... కానీ అది ప్రెషర్ కుక్కర్ కాదు... ఓ గడియారం... అదేంటో? దాని ముచ్చట్లేంటో ? చదివేద్దామా ! గడియారాలు దేంతో పనిచేస్తాయి? బ్యాటరీలతోనేగా అనేస్తారు. కానీ ఓ దగ్గర దానికి భిన్నం. అందుకే అదే ఓ పర్యటక ప్రాంతం. అసలు దాని ప్రత్యేకత ఏంటబ్బా?

Updated : 01 Aug 2019 00:14 IST

ఆవిరి పొగలు కక్కుతుంది... భలేగా ఈలలూ వేస్తుంది... కానీ అది ప్రెషర్ కుక్కర్ కాదు... ఓ గడియారం... అదేంటో? దాని ముచ్చట్లేంటో ? చదివేద్దామా !

గడియారాలు దేంతో పనిచేస్తాయి? బ్యాటరీలతోనేగా అనేస్తారు. కానీ ఓ దగ్గర దానికి భిన్నం. అందుకే అదే ఓ పర్యటక ప్రాంతం. అసలు దాని ప్రత్యేకత ఏంటబ్బా?

* అదో గజిబిజి దారి. రోడ్డు పక్కన ఎత్తయిన గడియారం ఉంటుంది. అది ఎప్పుడూ పొగలు కక్కుతూ కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? అది ఆవిరి గడియారం కాబట్టి. ఇలాంటి దాన్ని ఎక్కడా చూడలేదే? అసలు ఉన్నట్టూ వినలేదే అనుకుంటున్నారా? కెనడాలోని వాంకోవర్‌లో ఉందిది. దీని పేరు గ్యాస్‌టౌన్‌ స్టీమ్‌ క్లాక్‌. ఇలాంటి వాటిల్లో ఇదే మొదటిది.
* దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. వచ్చిన వారు కనీసం 15 నిమిషాలైనా నిలబడి చూస్తుండిపోతారు. ఎందుకంటే అప్పుడే దాని విశేషం ఏంటో తెలుస్తుంది మరి. ప్రతి పావుగంటకు ఈలలు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.
* ఇలా చాలా గడియారాలు శబ్దాలు చేస్తాయే అంటారేమో... కానీ ఇది ఈలలు వేసేది ఆవిరితో. 16 అడుగుల ఎత్తుండే ఈ గడియారం నాలుగువైపుల నుంచి శబ్దంతో పాటు పొగలూ వస్తుంటాయి.

* ఇంతకీ ఈ వింత క్లాక్‌ని ఎందుకు కట్టారంటే... అప్పట్లో ఇక్కడి స్థానికులు గుర్తు ఉండిపోయే ఓ స్మారకం నిర్మించాలనుకున్నారట. అలా రేమండ్‌ సాండర్స్‌ అనే హరాలజిస్టు(కాలాన్ని కొలిచే శాస్త్రవేత్త) ద్వారా 1977లో ఈ స్టీమ్‌ క్లాక్‌ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఇది భలేగా పనిచేస్తోంది.
* ఇంతకీ ఇది ఎలా ఉంటుందో చెప్పలేదు కదూ... ఆవిరితో పాటు ఈ గడియారం... గురుత్వాకర్షణశక్తితోనూ నడుస్తుందట. అదెలాగంటే ఈ గడియారానికి రకరకాల పరిమాణాలతో ఉండే స్టీలు బంతులుంటాయి. అవి కింద ఉన్న ఆవిరి యంత్రంతో కిందకు దిగుతాయి. అలా ఒక గొలుసును కదిలించి గడియారం ముళ్లు పనిచేసేలా చేస్తాయన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని