ఇసుక తిన్నెలు...నడుస్తాయిక్కడ!

చూపు చేరినంత దూరం ఇసుకే... ఎక్కడో ఓ చిన్న పొద.. అక్కడక్కడా ఓ ఒయాసిస్‌... ఇలా కనిపించి అలా మాయమయ్యే ఏరు... అప్పటికప్పుడే రూపం మార్చేసుకునే ఇసుక తిన్నెలు... ఏంటివన్నీ అంటే సహారా ఎడారి సంగతులు! ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక ఎడారి అనగానే సహారానే గుర్తొస్తుంది. అంతకు మించి దాని గురించి పెద్దగా తెలియదు మనకు. ఆసక్తికరమైన విషయాలు ఇక్కడెన్నో. అవేంటో చదివేద్దామా మరి!...

Updated : 10 Aug 2019 00:32 IST

చూపు చేరినంత దూరం ఇసుకే... 
ఎక్కడో ఓ చిన్న పొద.. 
అక్కడక్కడా ఓ ఒయాసిస్‌... 
ఇలా కనిపించి అలా మాయమయ్యే ఏరు... 
అప్పటికప్పుడే రూపం మార్చేసుకునే ఇసుక తిన్నెలు... 
ఏంటివన్నీ అంటే సహారా ఎడారి సంగతులు! 
ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక ఎడారి అనగానే సహారానే 
గుర్తొస్తుంది. అంతకు మించి దాని గురించి పెద్దగా తెలియదు మనకు. ఆసక్తికరమైన 
విషయాలు ఇక్కడెన్నో. 
అవేంటో చదివేద్దామా మరి!

ఇది పెద్ద ఎడారే కాదు అతి వేడిగా ఉండేదీనూ. సహారా అనేది అరబిక్‌ పదం.. దానికి అర్థం గొప్ప ఎడారి అని.
36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఆఫ్రికా ఖండంలో అల్గేరియా, ఈజిప్టు, చాద్‌, లిబియా, మౌరిటానియా, మాలీ, మొరాకో, నైగర్‌, సూడాన్‌, టునీషియా దేశాల్లో విస్తరించి ఉంది.
వాతావరణం.. విభిన్నం! 
ఇక్కడున్న వాతావరణం ప్రపంచంలోనే అతి ఇబ్బందికరమైనది. గాలులు ఎక్కువ. 
వర్షపాతం చాలా తక్కువ. సగానికిపైగా ఎడారిలో ఏడాదికి 1.5 సెం.మీ వర్షపాతం 
నమోదవుతుంది. 
రెండు వర్షాకాలాలుంటాయి. అంతా కలుపుకొన్నా ఇక్కడ సరాసరి 
వర్షపాతం 12 సెంటీమీటర్ల లోపే. 
ఇక ఎండైతే వేసవిలో 50డిగ్రీల పైకీ చేరుతుంది. 
దీని ఉత్తర భాగమంతా ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. 
శీతకాలం మంచు పడుతుంది. 1979లో ఇక్కడోసారి మంచు తుపానూ వచ్చింది.
ఒక్కోసారి... ఒక్కోలా! 
ఇక్కడ ఇసుక దిబ్బల సరాసరి ఎత్తు  500 అడుగులు. 
విపరీతమైన గాలుల కారణంగా ఈ దిబ్బలు ఎప్పటికప్పుడు ఆకారం మారిపోతూ, పక్కకు జరిగిపోతుంటాయి. 
ఎడారిలో ఒక వంతు ఇసుక దిబ్బలతో నిండి ఉంది. మరో వంతు ఎత్తయిన పర్వతాలున్నాయి. అతి ఎత్తయిన ప్రాంతం, అగ్ని పర్వతం ఎమి కోస్సీ. ఇది సముద్ర మట్టానికి 11 వేల 204 అడుగుల ఎత్తులో ఉంది. మరో వంతులో బీడు 
నేలల్లాంటివి ఉంటాయి. 
కొన్ని ఏర్లు, నదులు ఉన్నాయి.  కాలాన్ని బట్టి కనిపిస్తాయి. వేసవిలో మాయమవుతాయి.
ఉండేది ఎవ్వరంట? 
సహారా ఎడారనగానే మనుషులుంటారా? అనే అనుమానం వచ్చేస్తుంది. అయితే ఇక్కడే పుట్టి పెరిగిన వారూ ఉన్నారు. వారు టువరెగ్‌ తెగవారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల వీరి సంఖ్య ఇప్పుడు తగ్గిపోతోందట. 
సహారా ప్రాంతంలో అన్ని దేశాలవారూ కలిపి 25లక్షల మందికిపైగా ఉన్నారు. 
ఎడారిలో ఒకచోట నుంచి మరో చోటికి ఇప్పటికీ ఎక్కువగా ఒంటెలపైనే 
వెళతారు. 
చాలా ఎక్కువగా కనిపించే జంతువులు మేకలు, ఒంటెలు. కొన్ని అరుదైన రకాల నిప్పుకోళ్లు, చిరుతలు, ఎడారి బల్లులు... ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. 
ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే కనిపించే జీవజాతులు 500 వరకూ ఉన్నాయి. 
ఇక్కడ చాలా డైనోసర్‌ శిలాజాలూ బయటపడ్డాయి. 
ఈత, ఖర్జూరంలాంటి చెట్లతోపాటు ఎడారి మొక్కలూ కనిపిస్తుంటాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని