మనుషులు చేసిన దీవులు!

అనగనగా కొన్ని సరస్సులు.. వాటిలో ఒద్దికగా సర్దినట్లు దీవులు.. మళ్లీ వాటిల్లో పచ్చటి పొలాలు.. వెరసి ఆ ప్రాంతం ఓ కొత్త లోకం.. దాని విశేషాలే ఇవి!  అబ్బ! ఈ చిత్రాలు చూస్తుంటేనే భలేగా అనిపిస్తోంది కదూ! ఇంటికో దీవి. దీవికో రేవు అన్నట్లు ఈ ప్రాంతం ఎంత చక్కదనంతో ఉందో! చూడముచ్చటైన ఈ చోటు నెదర్లాండ్స్‌లోది. ఈ దేశంలో యుట్రెక్ట్‌ ప్రావిన్సు మొత్తం ఇలా బోలెడు సరస్సులతో నిండి ఉంటుంది. చిత్రమేమంటే ఈ సరస్సులు ఒకదానితో....

Published : 17 Aug 2019 00:34 IST

అనగనగా కొన్ని సరస్సులు.. వాటిలో ఒద్దికగా సర్దినట్లు దీవులు.. మళ్లీ వాటిల్లో పచ్చటి పొలాలు.. వెరసి ఆ ప్రాంతం ఓ కొత్త లోకం.. దాని విశేషాలే ఇవి! 
అబ్బ! ఈ చిత్రాలు చూస్తుంటేనే భలేగా అనిపిస్తోంది కదూ! ఇంటికో దీవి. దీవికో రేవు అన్నట్లు ఈ ప్రాంతం ఎంత చక్కదనంతో ఉందో! చూడముచ్చటైన ఈ చోటు నెదర్లాండ్స్‌లోది. 

ఈ దేశంలో యుట్రెక్ట్‌ ప్రావిన్సు మొత్తం ఇలా బోలెడు సరస్సులతో నిండి ఉంటుంది. చిత్రమేమంటే ఈ సరస్సులు ఒకదానితో ఒకటి సంబంధంతో ప్రావిన్సంతా విస్తరించి ఉంటాయి. వీటిని అక్కడంతా ‘లూస్‌ డ్రెచ్‌ లేక్స్‌’ అనేస్తుంటారు. 
సముద్రంలో చెల్లాచెదురుగా ఉన్న దీవుల్ని మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చూశారా? దీవులన్నీ చాలా ఒద్దికగా సర్దినట్లు ఉన్నాయి. అలా చక్కగా ఎందుకు ఏర్పడ్డాయంటే... అందుకో కారణముంది. 
ఒకప్పుడివి లోతు తక్కువగా ఉండే లోతట్టు ప్రాంతాలు. దీంతో అవి వ్యవసాయానికీ, నివాసానికీ రెండింటికీ పనికి రాకుండా ఉండేవి. 
వేల ఏళ్ల క్రితం ఈ నీటి స్థానంలో చెట్లూచేమలే ఉండేవి. తర్వాత్తర్వాత నీరు చేరి ఇలా సరస్సుల రూపంలోకి వచ్చాయి. దీంతో అక్కడి చెట్లు నీటిలోకి పడి కుళ్లిపోయి మెత్తటి పీచు పదార్థాలుగా మారాయి. వాటి నుంచి ఇంధనం ఉత్పత్తి చేస్తార్ట. దీంతో అక్కడి వారు  పీచులాంటి ఆ వ్యర్థ పదార్థాల్ని తవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ 1630 నుంచి వృక్ష సంబంధ 
పదార్థాల్ని మైనింగ్‌ చేయడం ప్రారంభించారు. 
కింద నుంచి తీసిన మట్టిని ఓ పద్ధతిలో పోగు చేసేవారు. మధ్యమధ్యలో మట్టిని చేరదీయడంతో ఈ సరస్సుల్లో దీవులు ఏర్పడిపోయాయి. 
అలా ఏర్పాటు చేసుకున్న కొన్ని దీవుల్లో ఇప్పుడు పంటలు పండించేస్తున్నారు. మరి కొన్నింటిలో చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని జీవనమూ సాగించేస్తున్నారు. దీంతో ఈ ప్రావిన్సులో ఉన్న సరస్సులన్నీ ఇప్పుడిలా ఎంతో అందంగా, జీవన యోగ్యంగా తయారైపోయాయి. ఇప్పుడీ దీవుల్ని చూసేందుకు బోలెడు మంది పర్యటకులూ వచ్చేస్తున్నారు. పడవల్లో ఇళ్ల మధ్య తిరిగేస్తూ ఆనందించేస్తున్నారు. భలే పరిణామమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని