తాతయ్య విమానం ఎక్కర బాబూ!

విమానం ఎక్కాలంటే బోలెడు డబ్బు కావాలి...కానీ అరవై రూపాయలున్నా ఎక్కేయొచ్చు...అదీ లేదంటే ఉచితంగానే ఎక్కనిస్తారు...ఇంతకీ ఎక్కడ?

Updated : 09 Dec 2022 13:05 IST

 

విమానం ఎక్కాలంటే బోలెడు డబ్బు కావాలి...కానీ అరవై రూపాయలున్నా ఎక్కేయొచ్చు...అదీ లేదంటే ఉచితంగానే ఎక్కనిస్తారు...ఇంతకీ ఎక్కడ?

  చాలామంది పేద పిల్లలు బొమ్మ విమానం తప్ప నిజమైన విమానం చూసే ఉండరు. మరి వారికా కోరిక తీరాలంటే ఎలా? అందుకే ఒకాయన సొంతంగా ఓ విమానాన్ని కొనేశాడు. దాంట్లో ఆ పిల్లల్ని ఎక్కించి విమానమెక్కిన అనుభూతిని కల్గిస్తున్నాడు. ఇంతకీ ఆ విశేషాలేంటి?

 

* దిల్లీ నగరంలోని దేశీయ విమానాశ్రయం దగ్గర్లో ఉన్న ఆ విమానం ఎక్కడానికి చాలా మంది పిల్లలు వస్తుంటారు. అందరూ వరుసగా బోర్డింగు పాసులు తీసుకుని విమానం ఎక్కుతారు. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తెలుసుకుంటారు. గాల్లో ఎగరకపోయినా పూర్తిగా విమాన ప్రయాణం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకుని సంబరపడిపోతారు.

   * ఈ విమాన సదుపాయం ఏర్పాటు చేసింది హరియాణాలోని కసన గ్రామానికి చెందిన బహదూర్‌ చాంద్‌ గుప్తా. ఇంతకీ ఈయనకీ ఆలోచన ఎలా వచ్చింది అంటే? వృత్తిరీత్యా ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరయిన బహదూర్‌ సొంత వూరికి వెళ్లినపుడు గ్రామస్థులంతా విమానం గురించి, విమానయానం గురించి ఆసక్తిగా అడిగేవారట. చెప్పటమే తప్ప వారికి స్వయంగా చూపించలేకపోయాననే అనుకునేవాడట. దాంతో విమాన ప్రయాణం చేయలేని వారి కోరిక తీర్చాలనుకున్నాడు. ఉద్యోగ విరమణ తర్వాత 2003లో ఓ పాత ఎయిర్‌బస్‌ కొన్నాడీ తాతయ్య. దాన్నే ఇప్పుడు పేద పిల్లల కోసం అందుబాటులో ఉంచాడన్నమాట.

* ఇందులో టికెట్‌ వెల రూ.60. కానీ అదీ కొనలేని పేద పిల్లలు ఉచితంగానే విమానం ఎక్కేయొచ్చు.

* బోర్డింగు పాసులు తీసుకునే దగ్గర్నించి ఎయిర్‌హోస్టెస్‌ విమానంలో బయలుదేరేముందు చెప్పే జాగ్రత్తలు, చిరుతిండ్లు ఇలా నిజమైన విమానంలో ప్రయాణం చేస్తే ఉండే ఏర్పాట్లన్నీ ఇందులోనూ ఉన్నాయి.

* విమానం లోపల ఉండే భాగాలతో పాటు పైలెట్లు ఉండే చోటుకు(కాక్‌పిట్‌) వెళ్లి చూడొచ్చు.

* ఈ విమానం ఎంతో మంది పిల్లల్ని ఆకర్షిస్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని