చల్లగా తెల్లగా స్టార్‌వార్‌ పాత్రలుగా!

గ్రహాంతరవాసులు... భీకర యుద్ధాలు చేశారు... ఎంతగానో అలరించారు... ఇప్పుడు మళ్లీ ముస్తాబయ్యారు... మంచు రూపంలో ప్రత్యక్షమయ్యారు... ఇంతకీ ఎవరు? ఎక్కడ?

Published : 17 Jan 2016 11:16 IST

చల్లగా తెల్లగా స్టార్‌వార్‌ పాత్రలుగా!

గ్రహాంతరవాసులు... భీకర యుద్ధాలు చేశారు... ఎంతగానో అలరించారు... ఇప్పుడు మళ్లీ ముస్తాబయ్యారు... మంచు రూపంలో ప్రత్యక్షమయ్యారు... ఇంతకీ ఎవరు? ఎక్కడ?

స్టార్‌వార్స్‌ సినిమాలు చూసే ఉంటారు. అందులోని పాత్రలు చిత్రవిచిత్రమైన వేషాల్లో పోరాటాలు సాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆట బొమ్మల నుంచి వీడియో గేముల వరకు దూకి ఎంతో పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు మంచు రూపంలోకి మారిపోయి మరింత అబ్బురపరుస్తున్నాయి.

* చూడాలంటే బెల్జియంలోని లీజ్‌ నగరంలో జరుగుతున్న ‘మంచు శిల్పాల పండుగ’కి వెళ్లాల్సిందే. ఏటా జరిగే ఈ వేడుకలో ఈసారి ఆకర్షణ మంచు శిల్పాలను స్టార్‌వార్స్‌ పాత్రలతో చేయడమే.

* పొడవైన చెవులతో చిత్రమైన రూపంలో ఉండే యోధా పాత్ర, తలపై నల్లటి హెల్మెట్‌తో ముసుగు ధరించిన ‘డార్త్‌ వాడర్‌’ అందమైన కొప్పుతో ఉండే ప్రిన్సెస్‌ లియా ఇలా అన్ని స్టార్‌వార్‌ పాత్రలు మంచులో తెల్లగా మెరిసిపోతూ కనువిందు చేస్తున్నాయి. స్టార్‌వార్‌ సినిమాల్లో కనిపించే ల్యూక్‌ స్కైవాకర్‌, కైలో వంటి రకరకాల పాత్రలతో పాటు అందులోని వాహనాల్ని కూడా మంచు శిల్పాలుగా మలిచారు. 

* ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానున్న ‘ది ఫోర్స్‌ అవేకెన్స్‌’ స్టార్‌వార్‌ చిత్రంలోని స్టార్‌వార్ల పాత్రల రూపాల్ని కూడా ప్రత్యేకంగా మంచుతో తయారుచేసి ఉంచారు. ఈ ప్రదర్శనలో మొత్తం 61 మంచు బొమ్మలు ఉన్నాయి.

* పన్నెండు దేశాలకు చెందిన 30 మంది కళాకారులు వీటిని తీర్చిదిద్దారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మంచుగడ్డల్ని చెక్కుతూ వీటిని తయారుచేశారు. కొన్ని మంచు శిల్పాలు తెల్లగా కనిపించడానికి పాలు కూడా కలిపారట. 20 రకాల పరికరాల్ని వాడుతూ కళ్లు చెదిరే శిల్పాలుగా చెక్కారు. అవి కరిగిపోకుండా ఉండటానికి తక్కువ ఉష్ణోగ్రత ఉండేట్లు ఏర్పాట్లుచేస్తారు. 

* వీటి తయారీకి 500 టన్నుల మంచును ఉపయోగించారు. అంటే దాదాపు 5 లక్షల కిలోలన్నమాట.

* నవంబరు 14న మొదలైన ఈ ప్రదర్శన వచ్చే ఏడాది జనవరి వరకు కొనసాగుతుంది.
* ఈ మంచు బొమ్మల్ని చూడ్డానికి బోలెడు మంది పర్యాటకులు వస్తున్నారు. మంచు స్టార్‌వార్లని కెమెరాల్లో బంధిస్తూ, ఫొటోలు దిగుతూ తెగ సందడి చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని