చిన్ని వాటికన్‌... లెగోలతో అదిరెన్‌!

ప్రపంచంలోనే అతి చిన్న దేశం... అదే వాటికన్ సిటీ... ఆ నగరం ఇప్పుడు మరింత చిన్నదైపోయింది...ఎలాగో తెలుసా? వాటికన్ సిటీ ఎక్కడుంది? అంటే ఐరోపా ఖండంలో, రోమ్ దగ్గర అని అందరికీ తెలిసిందే. కానీ వాటికన్ సిటీ ఇప్పుడు అమెరికాలో కొలువై ఉంది. నమ్మలేకపోతున్నారా?

Published : 17 Jan 2016 12:05 IST

చిన్ని వాటికన్‌... లెగోలతో అదిరెన్‌!

ప్రపంచంలోనే అతి చిన్న దేశం... అదే వాటికన్‌ సిటీ... ఆ నగరం ఇప్పుడు మరింత చిన్నదైపోయింది...ఎలాగో తెలుసా? వాటికన్‌ సిటీ ఎక్కడుంది? అంటే ఐరోపా ఖండంలో, రోమ్‌ దగ్గర అని అందరికీ తెలిసిందే. కానీ వాటికన్‌ సిటీ ఇప్పుడు అమెరికాలో కొలువై ఉంది. నమ్మలేకపోతున్నారా? అయితే పదండి బుల్లి వాటికన్‌ను చూసొద్దాం.

* ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వాటికన్‌ సిటీని చూడ్డానికి ఇప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి దీన్ని ఎలా చేశారో తెలుసా? మొత్తం లెగో బ్రిక్స్‌తో. అంటే ఇది లెగో వాటికన్‌ నగరం అన్నమాట!

* ఈ కళాఖండాన్ని బాబ్‌ సైమన్‌ అనే చర్చి ఫాదర్‌ తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతి చిన్న, అతి తక్కువ జనాభా గల దేశంగా ప్రఖ్యాతి చెందిన వాటికన్‌ నగరం చాలా అద్భుతంగా ఉంటుంది. రోమన్‌ కాథలిక్‌ చర్చిలకు ప్రధాన కేంద్రమైన ఇక్కడ పోప్‌ నివాసం ఉంటారు. అయితే ఈ అందాల నగరాన్ని ఫాదర్‌ సైమన్‌ అచ్చుగుద్దినట్టు లెగోలతో సూక్ష్మనమూనాలో తయారుచేశారు. ఎందుకో తెలుసా? ఈ మధ్యే పోప్‌ అమెరికాకు వచ్చారు. ఆయన రాకకు గుర్తుగా బుల్లి వాటికన్‌ను చేశారు.

 *ఈ వాటికన్‌ నిర్మాణానికి సుమారు 50,000 లెగో బ్రిక్స్‌ వాడారట. ఇందుకోసం పదినెలలపాటు శ్రమించారు.

* వాటికన్‌లో ఉండే సెయింట్‌ పీటర్స్‌ బసిలికా, సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ ఇలా ప్రతీదీ లెగోలతో చేశారు. కేవలం నగరమే కాదు, ఇందులో ఉండే పోప్‌ బొమ్మతో సహా, జనాల రూపాన్ని కూడా సూక్ష్మ నమూనాలో చేసి పెట్టారు బాబ్‌. తన బొమ్మను కూడా చేసి ఓ మూలన పెట్టుకున్నారు.

మీకు తెలుసా?

* వాటికన్‌ సిటీ వైశాల్యం 110 ఎకరాలు మాత్రమే. జనాభా సుమారు 1000!

* వాటికన్‌ సిటీ యునెస్కో వారసత్వ గుర్తింపు పొందింది.

* వాటికన్‌ మ్యూజియంలో రోమన్ల చరిత్రకు సంబంధించిన అద్భుతమైన కళాఖండాలు భద్రపరిచి పెట్టారు. ఈ మ్యూజియంలోని ఒక్కో వస్తువును నిముషంపాటు చూస్తే, అన్ని కళారూపాలను చూడ్డానికి నాలుగేళ్ల సమయం పడుతుందిట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని