వేలాది ప్రయోగాలు.... వందలాది ఆటలు!

అక్కడే కూ చుక్‌చుక్‌ రైళ్లు ఎక్కొచ్చు. ఆ పక్కనే విమానాలూ సందడి చేస్తాయి. మరో పక్క మిసైళ్లు, రాకెట్లు. అంతలోనే జలాంతర్గామిలో వెళ్లొచ్చు. కాసేపు రోబోలతో ఆడుకోవచ్చు, ఇంకా మీరే సైన్స్‌ ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు...

Published : 05 Apr 2016 00:03 IST

వేలాది ప్రయోగాలు.... వందలాది ఆటలు!  

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్‌ మ్యూజియం... చూడాలనుంటే జర్మనీ వెళ్లాలి... ఆ సైన్స్‌ లోకంలో వేలాది వింతలు... మరి ఆ సంగతులు తెలుసుకుందామా?

క్కడే కూ చుక్‌చుక్‌ రైళ్లు ఎక్కొచ్చు. ఆ పక్కనే విమానాలూ సందడి చేస్తాయి. మరో పక్క మిసైళ్లు, రాకెట్లు. అంతలోనే జలాంతర్గామిలో వెళ్లొచ్చు. కాసేపు రోబోలతో ఆడుకోవచ్చు, ఇంకా మీరే సైన్స్‌ ప్రయోగాలు చేసి శాస్త్రవేత్తలు అయిపోవచ్చు. ఈ విశేషాలన్నీ ప్రపంచంలోనే అతి పెద్ద సైన్స్‌ ప్రదర్శనశాల ‘డ్యూచెస్‌ మ్యూజియం’వే. జర్మనీలోని మ్యూనిక్‌లో ఉందిది.

* ఇసార్‌ నదిలోని దీవిలో ఉన్న ఈ సైన్స్‌ మ్యూజియంలో ఒకటా రెండా ఏకంగా లక్ష వస్తువులు ప్రదర్శనకు ఉన్నాయి. ఇప్పుడు మరిన్ని హంగులతో కొత్త ఆకర్షణలు కూడా ఏర్పాటుచేస్తున్నారు.

* విశాలమైన ఈ భవనంలోని 8 అంతస్తుల్లో సైన్స్‌ వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. మొత్తం 50 రంగాలకు చెందిన పరికరాలు ఇక్కడ అబ్బురపరుస్తాయి. ఈ మ్యూజియాన్ని 1903లో ప్రారంభించారు. అంటే ఇప్పటికి 113 సంవత్సరాలైందన్నమాట. ప్రపంచంలోనే అతి పెద్ద, పురాతన సైన్స్‌ ప్రదర్శనశాల కూడా ఇదేనని చెబుతారు.

* ఈ సైన్స్‌ ప్రపంచాన్ని సందర్శిస్తే ఎన్నో రంగాల సాంకేతిక పరిజ్ఞానాల గురించి అవగాహన వస్తుంది. రోబోటిక్స్‌, నానో, అణు పరిజ్ఞానం, అంతరిక్షం, వాతావరణం, రవాణా, విద్యుచ్ఛక్తి ఇలా అన్ని రంగాల్లోని సైన్స్‌ పరిశోధనలు ప్రత్యక్షంగా ఇక్కడ చూడొచ్చు.

* ప్రతీ ప్రయోగం ముందు ఒక బటన్‌ ఉంటుంది. దాన్ని నొక్కగానే అది ఎలా పనిచేస్తుందో చూడొచ్చు. ఉదాహరణకు రోబోటిక్స్‌ రంగం ఉందనుకోండి. రోబోలు ఎలా నడుస్తాయి, మన సంకేతాలకు తగ్గట్టు ఎలా స్పందిస్తాయో చూడొచ్చు. ఇలా ఇక్కడ ప్రతీ అంశం పిల్లలకు అర్థమయ్యే రీతిలో చూపేందుకు ఏర్పాటుచేశారు.

* పిల్లల కోసం ‘కిండర్‌రీచ్‌’ విభాగం ఉంది. ఇందులో 1000 అంశాలు వినోదాన్ని పంచడానికి కొలువున్నాయి. లెగోతో బొమ్మలు చేయడం, అలలను సృష్టించడం, ప్రతిధ్వనిని రప్పించడం, బొమ్మలతో కనికట్టు చేయడం... ఇలా అన్నీ తమాషాగా ఉంటాయి.

* ట్రాన్స్‌పోర్ట్‌ విభాగంలోకి వెళితే రేసు కార్ల దగ్గర్నించి సైకిళ్ల వరకు అన్ని వాహనాలను ప్రదర్శనకు పెట్టారు. తొలినాళ్లలో విమానాలు, రైళ్లు ఎలా ఉండేవో చూడొచ్చు. జలాంతర్గాముల్లోకి వెళ్లి వాటి పనితనాన్ని తెలుసుకోవచ్చు. వ్యోమనౌకలు, రాకెట్ల నమూనాలు కూడా ఏర్పాటుచేసి పెట్టారు.

* అంతరిక్ష విజ్ఞానాన్ని అందించడానికి నక్షత్రశాలా ఉందిక్కడ. తొలినాళ్లలో కంప్యూటర్లు ఎలా ఉండేవో, ఇప్పుడు సూపర్‌ కంప్యూటర్లు ఎంత వేగంగా పనిచేస్తున్నాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తారు.

* ఈ సైన్స్‌ ప్రదర్శనశాలకు ఏటా సుమారు 35 లక్షల మంది సందర్శకులు వస్తారు!

 

 

 

 



 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని