వేలాది ఏళ్లుగా ‘చెద’రని ఇళ్లు!

మనుషులు కట్టిన ఇళ్లు ఎన్నేళ్లు ఉంటాయి? వంద, రెండొందలు, మహా అయితే అయిదొందలు. కానీ చెదపురుగులు (టెర్మైట్స్‌) కట్టిన ఇల్లు ఏకంగా 2200 ఏళ్లయినా చెక్కు చెదరలేదు తెలుసా? అంటే మనకన్నా అవి గొప్ప ఇంజినీర్లన్నట్టేగా.

Published : 13 Apr 2016 00:33 IST

వేలాది ఏళ్లుగా ‘చెద’రని ఇళ్లు!

చెదలను మనం తిడుతుంటాం... కానీ అవి అద్భుతమైన ఇంజినీర్లని తెలుసా? ఎలాగంటారా? అయితే కొత్తగా బయటపడ్డ ఈ సంగతి చదవండి!

నుషులు కట్టిన ఇళ్లు ఎన్నేళ్లు ఉంటాయి? వంద, రెండొందలు, మహా అయితే అయిదొందలు. కానీ చెదపురుగులు (టెర్మైట్స్‌) కట్టిన ఇల్లు ఏకంగా 2200 ఏళ్లయినా చెక్కు చెదరలేదు తెలుసా? అంటే మనకన్నా అవి గొప్ప ఇంజినీర్లన్నట్టేగా.

* ఆఫ్రికా దేశమైన కాంగో తెలుసుగా? అక్కడి మయొంబో అడవుల్లో ఈ మధ్య కొందరు శాస్త్ర వేత్తలు చెదల పుట్టలపై పరిశోధనలు చేశారు. అక్కడ నాలుగు పుట్టలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఎంతంటే వాటిల్లో అతి పెద్దది 32 అడుగులకు పైగా ఎత్తు, అడుగు భాగం 40 అడుగుల చుట్టు కొలతతో భారీగా ఉంది. అంటే జిరాఫీ కన్నా ఎత్తయిన పుట్ట అన్నమాట. చెదపురుగు శరీర పరిమాణంతో చూస్తే మనం వంద అంతస్తుల భవనం కట్టినదానికన్నా ఈ పుట్ట ఎక్కువ ఎత్తనుకోవచ్చు.

* కార్బన్‌ డేటింగ్‌ పద్ధతి ద్వారా ఈ పుట్ట ఎన్నేళ్ల క్రితం కట్టినదో తెలుసుకున్నారు. అప్పుడు వారికి ఆశ్చర్యం కలిగించే సంగతి తెలిసింది. అదేంటంటే ఈ పుట్టల్లో ఒకటి 2200 ఏళ్ల క్రితం ‘మాక్రోటర్మ్స్‌ ఫాల్సిగర్‌’ అనే జాతికి చెందిన చెదలు నిర్మించాయిట. ఈ ప్రాంతంలోనే ఉన్న మరో మూడు పుట్టలు 750 ఏళ్ల నుంచి 1500 ఏళ్ల క్రితం 

కట్టినవని తేలింది. అయితే వీటిల్లో అతి పురాతన పుట్టలో 500 ఏళ్ల క్రితం వరకు చెదలు నివాసం ఉండేవి. అంటే వేల ఏళ్ల పాటు వారసత్వంలా ఒక తరం తర్వాత మరో తరం చెదలు దీంట్లో నివాసం ఉన్నాయన్నమాట. తర్వాత అవి ఖాళీ చేసినా గానీ పుట్టలు అలాగే ఉండిపోయాయి.

* ఇన్నాళ్లూ చెదలు చాలా ఎత్తయిన పుట్టలు కట్టగలవని తెలుసుగానీ, ఇవి కట్టిన పుట్టలు ఇంత పురాతనమైనవన్న సంగతి కొత్తగా తెలిసింది.

* ఇప్పటికీ రెండు పుట్టల్లోని పైభాగంలో చెదలు నివాసం ఉంటున్నాయి.

* లోపలికి గాలి, వెలుతురు వచ్చేలా, భారీ వర్షాలకు, అడవిలో చెలరేగిన మంటలకు కూడా పాడవకుండా చెదలు పుట్టలను ఇంత అద్భుతంగా కట్టడం నిజంగా వింతే కదూ!


మీకు తెలుసా?

* టెర్మైట్లలో మూడువేలకుపైగా జాతులుఉన్నాయి
* ఫొర్మొసన్‌ టెర్మైట్ల కాలనీ ఏడాదికి 500 కేజీల కలపను తినేస్తుంది!
* భూమ్మీదున్న చెదలన్నీ మనుషులకు పంచితే ఒక్కొక్కరికీ 500 కేజీలు వస్తాయిట!
* వీటిల్లో కొన్ని 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి!
* 250 మిలియన్‌ ఏళ్లకన్నా ముందు నుంచి చెదలు భూమిపై ఉన్నాయి
* చీమల్లో ఉన్నట్టే చెదల కాలనీకి క్వీన్‌ టెర్మైట్‌ ఉంటుంది. అది 30,000 గుడ్లను పెడుతుంది



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని