భళా... బుల్లి సీఈఓ!

పద్నాలుగేళ్ల టేలర్‌ రోసెంథల్‌. అమెరికాలోని అలబామాలో ఉంటాడు. అక్కడి ఒపెలికా హై స్కూల్లో 8వ గ్రేడ్‌ చదువుతున్నాడు.

Published : 18 May 2016 01:44 IST

భళా... బుల్లి సీఈఓ!

 

* ఎవరీ అబ్బాయి?
* పద్నాలుగేళ్ల టేలర్‌ రోసెంథల్‌. అమెరికాలోని అలబామాలో ఉంటాడు. అక్కడి ఒపెలికా హై స్కూల్లో 8వ గ్రేడ్‌ చదువుతున్నాడు.

* మన పేజీలోకి ఎందుకొచ్చినట్టో?
* చిన్నవయసులోనే ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. తనే సీఈఓగా ‘రెక్‌మెడ్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ కంపెనీని నడుపుతున్నాడు.

* అవునా? ఇంతకీ ఏంటా ఆవిష్కరణ? ఏమా సంగతులు?
* ప్రథమ చికిత్స కిట్‌ అందించే వెండింగ్‌ మెషిన్‌ను తయారుచేశాడు. ఏటీఏంలా ఉండే ఈ యంత్రంలో డబ్బులు వేస్తే ప్లాస్టర్లు, రబ్బరు గ్లౌజులు వంటి ప్రథమ చికిత్సకు అవసరమయ్యే వస్తువులు వస్తాయి. గాయాలు, ఎండకు బొబ్బలు రావడం, కందిరీగలు కుట్టడం, చేతులు కోసుకోవడం ఇలాంటి ఒక్కో సమస్యకు యంత్రంపై ఒక్కో మీట ఉంటుంది. అవసరమైన దాన్ని నొక్కితే ఆ చికిత్సకు పనికొచ్చే వస్తువులు వస్తాయన్నమాట.

* ఇంతకీ పిల్లాడికి ఈ ఆలోచన ఎలా వచ్చింది?
* టేలర్‌ స్నేహితులతో కలిసి బేస్‌బాల్‌ ఆడేప్పుడు ఎవరికైనా గాయాలైతే వెంటనే ప్రథమ చికిత్స కోసం పరుగులు పెట్టాల్సి వచ్చేది. తగిన చికిత్సా సామగ్రి అందడంలో ఆలస్యం జరిగితే సమస్య మరింత పెద్దదయ్యేది. ఇది గమనించిన టేలర్‌కు గాయానికి కచ్చితంగా సరిపోయే ప్రథమ చికిత్సా వస్తువులు వేగంగా, సులభంగా అందుబాటులో ఉండేలా యంత్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తన స్కూల్లో ‘ఔత్సాహిక పారిశ్రామిక’ తరగతిలో ఈ అబ్బాయి ప్రతిపాదించిన ఈ వ్యాపార ఆలోచనకు మొదటి బహుమతి వచ్చింది. తర్వాత టేలర్‌ వైద్యవృత్తిలో ఉన్న అమ్మానాన్నల సాయంతో గత ఏడాది సొంత కంపెనీనే మొదలుపెట్టాడు.

* అబ్బో... గొప్ప ఘనతే సాధించాడన్నమాట...
అంతేకాదు, ఇంకో విశేషం ఉంది. ఈ బాలమేధావి ఆలోచన అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఆవిష్కరణను అమ్మితే అక్కడి జాతీయ ఆరోగ్య సంస్థ రూ.200 కోట్ల వరకు ఇస్తానని ముందుకొచ్చింది. అంత భారీ మొత్తం వచ్చే అవకాశాన్ని కూడా టేలర్‌ ఒప్పుకోలేదు. స్వయంగా తానే తన వ్యాపారాన్ని నడపాలనుకుంటున్నాడు. ఇప్పటికే 100 యంత్రాల తయారీకి ఆర్డర్లు అందుకున్నాడు. మరెన్నో ప్రసిద్ధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఒక్కో యంత్రం ఖరీదు 5,500 డాలర్లు అవుతుంది. ఇప్పటికే టేలర్‌ ఈ యంత్రం తయారీపై లక్ష డాలర్లు పెట్టుబడి పెట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని