విన్యాసాలు చేస్తా... రికార్డులు కొడతా!

బంతులతో మీరేనా ఆడుకునేది? నేనూ ఆడుకుంటాను. బంతిపై నడుస్తా కూడా! ‘కుక్కేంటీ? బంతిపై నడవడమేంటీ? ఆడుకోవడమేంటీ?’ అని తీసిపారేయకండి.

Published : 21 May 2016 01:06 IST

విన్యాసాలు చేస్తా... రికార్డులు కొడతా!

బంతులతో మీరేనా ఆడుకునేది? నేనూ ఆడుకుంటాను. బంతిపై నడుస్తా కూడా! ‘కుక్కేంటీ? బంతిపై నడవడమేంటీ? ఆడుకోవడమేంటీ?’ అని తీసిపారేయకండి. ఈమధ్యే మా శునకాలకు జరిపిన పోటీలో పెద్ద బంతిపై 11.9 సెకన్లలో పది మీటర్ల దూరం ప్రయాణించా. దీనికి ‘బంతిపై అత్యధిక దూరం నడిచిన కుక్కవు నువ్వే’ అంటూ గిన్నిస్‌వాళ్లు రికార్డు కట్టబెట్టారు తెలుసా!

* బంతి మీదకెక్కి దాన్ని కాళ్లతోనే దొర్లిస్తూ వెళతానన్నమాట. నా ఈ విన్యాసాల్ని అంతర్జాలంలో పెడితే లక్షల మంది వీక్షించారు. బోలెడు లైకులు కొట్టారు. ఎంతో మంది నా అభిమానులయ్యారు.

* నా పేరు పురిన్‌. వయసు పదేళ్లు. టోక్యోలో ఉంటాను. మా యజమాని మకొటో కుమగాయ్‌ ఈ వింత విన్యాసాలు నాకు నేర్పించారు.

* ఇదివరకే గోల్‌కీపింగ్‌ పోటీల్లో ఒక నిమిషంలో 14 గోల్స్‌ ఆపి గిన్నిస్‌ రికార్డు సంపాదించా.

* అంతేనా? నాకింకా బోలెడు విద్యలొచ్చు. స్కేటింగ్‌ చేస్తా. రెండు కాళ్లపై చకచకా నడుస్తా. తాడుతో స్కిప్పింగ్‌ కూడా చేసి చూపిస్తా. నా ఈ విన్యాసాల్ని చూసినవాళ్లంతా నన్ను తెగ పొగుడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని