మూడు మెట్ల జలపాతం!

చుట్టూ పచ్చటి చెట్లు. మధ్యలో నల్లని రాళ్లపై తెల్లటి పాల లాంటి నీటి ధారలు. ఎత్తయిన కొండలమీద నుంచి మూడు అంచెల్లో కిందకు దూకుతుందీ జలపాతం. పేరు ‘ఎలిఫెంట్‌ ఫాల్స్‌’. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈమధ్యే దీన్ని సందర్శించారు. ‘అందరూ చూడాల్సిన మంచి పర్యటక ప్రాంతం’ అంటూ ట్విట్టర్‌లో ట్విట్‌ కూడా చేశారు. మీరూ చూడాలంటే మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లాల్సిందే.

Updated : 08 Dec 2022 20:15 IST

* షిల్లాంగ్‌ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం భలేగా ఉంటుంది. ఏ జలపాతమైనా కొండపై నుంచి ఏకధారగా పడుతుంటుంది కానీ ఎలిఫెంట్‌ ఫాల్స్‌ ప్రయాణం మాత్రం విభిన్నం. కొండపై నుంచి మూడు అంచెల్లో కిందకు దూకుతుంది. అంటే మూడు చోట్ల ఆగుతూ కిందకు జారుతుంది. అందుకే దీన్ని స్థానిక ఖాసి జాతి ప్రజలు ‘కాక్‌సాయిడ్‌ లై పటెంగ్‌ కోహ్‌సియు’ అని పిలుస్తారు. అంటే మూడు మెట్ల జలపాతం అని అర్థం.

* నగరానికి అత్యంత దగ్గరగా ఉన్న ఈ జలపాతాన్ని మెట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూసి రావచ్చు. పైనుంచి కింద వరకు ఉన్న ఈ మెట్ల దారిలో జాలువారుతున్న ఈ జలపాతం ఒక్కో అంచెను చూడ్డానికి కనీసం వంద మీటర్లు కిందకు దిగాలి. అంటే పై నుంచి కింద వరకు మొత్తం కలిపి 300 మీటర్ల వరకు దిగాలన్నమాట.

* జలపాతం చివరన ఏనుగు ఆకారంలో పెద్ద రాయి ఉండటం వల్ల అప్పట్లో బ్రిటిష్‌ వాళ్లు దీనికి ‘ఎలిఫెంట్‌ ఫాల్స్‌’ అని పేరు పెట్టారు. కానీ 1897లో వచ్చిన భూకంపంతో ఈ రాయి పగిలిపోయింది.

* జలజలపారే నీళ్లతో ఈ ప్రాంతం వర్షాకాలంలో మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

* ఈ జలపాతం దగ్గర సంప్రదాయ హస్తకళాకృతుల దుకాణాలు కూడా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని