లోయపై జోరుగా... జరజరా జారగా!

రయ్యిమంటూ వెళుతుంది. జర్రుజర్రున దూసుకుపోతుంది. క్షణాల్లో వేలాది అడుగుల దూరం ప్రయాణిస్తుంది. గాల్లో తేలిన అనుభూతినిస్తుంది. ఏంటీ ఇదంతా? ‘ది మాన్‌స్టర్‌ జిప్‌లైన్‌’ సంగతులు. ఈమధ్యే ఇది గిన్నిస్‌ రికార్డు కొట్టింది. మరి దీని సంగతులేంటో తెలుసుకోకపోతే ఎలా?

Updated : 08 Dec 2022 19:45 IST

రయ్యిమంటూ వెళుతుంది. జర్రుజర్రున దూసుకుపోతుంది. క్షణాల్లో వేలాది అడుగుల దూరం ప్రయాణిస్తుంది. గాల్లో తేలిన అనుభూతినిస్తుంది. ఏంటీ ఇదంతా? ‘ది మాన్‌స్టర్‌ జిప్‌లైన్‌’ సంగతులు. ఈమధ్యే ఇది గిన్నిస్‌ రికార్డు కొట్టింది. మరి దీని సంగతులేంటో తెలుసుకోకపోతే ఎలా?

పొడవైన తీగ ఆధారంగా వేగంగా వెళ్లే జిప్‌లైన్‌ విన్యాసం గురించి వినే ఉంటారుగా? వాటిల్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తయిన జిప్‌లైన్‌గా రికార్డు దక్కించుకుంది.

ప్యూర్టోరికోలోని ‘టోరో వెర్డే అడ్వెంచర్‌’ పార్కులో ఉన్న ఈ రైడులో తీగ ఏకంగా 7,590 అడుగుల పొడవుంటుంది. నేలపై నుంచి 1200 అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఈ సాహస విన్యాసం భలేగా ఉంటుంది. ఒక కొండపై నుంచి మరో కొండపైకి చేరుకోవడానికి బలమైన ఉక్కు తీగలు అమర్చి ఉంటాయి. మీట నొక్కగానే సాహసికులు తీగల  సాయంతో సూపర్‌మ్యాన్‌లా నేలకు సమాంతరంగా ముందుకు దూసుకుపోతారు. గాల్లో అంత ఎత్తున జర్రున జారుతూ ఒకవైపునుంచి మరోవైపుకు చేరుకుంటారు. గంటకు 150  కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందీ రైడు. అమ్మో మరి కింద పడిపోమా అంటే? మరేం భయం లేదు. ఎందుకంటే మనం పడిపోకుండా నడుముకు దృఢమైన బెల్టులు కడతారు. రక్షణ  ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకుంటారు.

ఈ సాహసం చేస్తుంటే కిందంతా లోయలు, అందులో నిండా చెట్లు, చుట్టుపక్కల పరిసరాలు గమ్మత్తుగా కనిపిస్తాయి.
 
 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని