భూగోళం చుట్టొచ్చే బుల్లి పక్షి!

దేశాలు, ఖండాలు దాటి వలస వెళ్లే పక్షుల గురించి వినుంటారు. మరి వాటిలో ఆర్కిటిక్‌ టెర్న్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో సుదీర్ఘ దూరం వలస వెళ్లిన పక్షిగా రికార్డు కొట్టింది. యూకేలోని ఫర్న్‌ దీవుల్లో ఉండే ఈ పక్షులు ఏటా అంటార్కిటికాకు వలస వెళ్లి మళ్లీ తిరిగి వస్తాయి

Published : 11 Jun 2016 02:22 IST

భూగోళం చుట్టొచ్చే బుల్లి పక్షి!

దేశాలు, ఖండాలు దాటి వలస వెళ్లే పక్షుల గురించి వినుంటారు. మరి వాటిలో ఆర్కిటిక్‌ టెర్న్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో సుదీర్ఘ దూరం వలస వెళ్లిన పక్షిగా రికార్డు కొట్టింది.

* యూకేలోని ఫర్న్‌ దీవుల్లో ఉండే ఈ పక్షులు ఏటా అంటార్కిటికాకు వలస వెళ్లి మళ్లీ తిరిగి వస్తాయి. ఈ ప్రయాణమంతా కలిపితే 95,997 కిలోమీటర్ల దూరం అవుతుంది. అంటే భూమిని రెండుసార్లు చుట్టి వచ్చేంత దూరమన్నమాట.

* ‘పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు’ ఈ పక్షుల బరువు వంద గ్రాములే అయినా వేలాది కిలోమీటర్ల దూరం వలస వెళతాయి.

* ఇవి ఎగురుతున్నప్పుడు ఆహారం ఎలా? ఆకలేస్తే సముద్రాల, సరస్సుల ఉపరితలాల మీదుగా వెళుతూ చటుక్కున చేపల్నీ, చిన్న చిన్న జలచరాల్నీ పట్టుకుని తినేస్తాయి.

* గంటకు 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ పక్షులు రోజుకు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.

* అయితే ఇదంతా ఎలా తెలిసింది? వలస వెళ్లబోయే ముందు 29 ఆర్కిటిక్‌ టెర్న్‌ పక్షుల్ని తీసుకుని వాటికి తేలికపాటి జియోలొకేటర్లు అమర్చి పరీక్షించారు శాస్త్రవేత్తలు. అంటే ఈ పక్షులు ఎక్కడెక్కడ తిరిగినా ఆ వివరాలన్నీ ఇట్టే తెలిసిపోతాయన్నమాట. అలా ఆ పక్షులు ఫర్న్‌ దీవుల నుంచి చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి రావడం గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇవి అత్యధిక దూరం ప్రయాణించి రికార్డు కొట్టాయి.

* ఆర్కిటిక్‌ టెర్న్‌ పక్షులు జీవిత కాలంలో సుమారు 30లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.

మీకు తెలుసా?
బార్‌టేల్డ్‌ గాడ్‌విట్‌ అనే పక్షులు ఆహారం కోసం కూడా ఎక్కడా ఆగకుండా ఎనిమిది రోజుల పాటు ప్రయాణం చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని