ప్రపంచంలోని గులాబీలన్నీ ఒకే చోట!

ఎటు చూసినా రోజా పూలే. గులాబీల గుబాళింపులే. ఇదంతా ‘రోజ్‌ మ్యూజియం’ సంగతులు. ఈ మధ్యే ప్రారంభమైన ఈ మ్యూజియం ప్రపంచంలోనే మొదటిది. చూడాలంటే చైనా బీజింగ్‌లోని డాక్సింగ్‌కి వెళ్లాల్సిందే.

Published : 15 Jun 2016 01:13 IST

ప్రపంచంలోని గులాబీలన్నీ ఒకే చోట!

టు చూసినా రోజా పూలే. గులాబీల గుబాళింపులే. ఇదంతా ‘రోజ్‌ మ్యూజియం’ సంగతులు. ఈ మధ్యే ప్రారంభమైన ఈ మ్యూజియం ప్రపంచంలోనే మొదటిది. చూడాలంటే చైనా బీజింగ్‌లోని డాక్సింగ్‌కి వెళ్లాల్సిందే.

* మీ తోటలో మహా అయితే పదుల సంఖ్యలో గులాబీ రకాలుంటాయేమో కానీ ఇక్కడ ఏకంగా 2,300 జాతుల రోజా పూలని చూడొచ్చు. అంటే దాదాపు ప్రపంచంలోని అన్ని రకాల గులాబీ పువ్వులు ఇక్కడ ఉంటాయన్నమాట.

* ఈ మ్యూజియం భవనాన్ని రోజా పువ్వు ఆకారంలో భలేగా నిర్మించారు. లోపలికి వెళితే గోడల దగ్గర్నించి, పై కప్పు వరకు అన్నీ గులాబీ పూల గుర్తులతో నిండి ఉంటాయి. మ్యూజియం బయట వేలాది రకాల పూల తోటలతో పాటు కృత్రిమంగా బోలెడు రోజాపూల ఆకారాల్ని తీర్చిదిద్దారు. త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో రకరకాల వస్తువుల్ని, పెయింటింగ్స్‌ని, కళారూపాల్ని తయారుచేసి అచ్చంగా మ్యూజియం మొత్తాన్ని ఈ పూల అలంకరణతో ముస్తాబుచేశారు.

* ఒక్కమాటలో చెప్పాలంటే 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిని గులాబీ లోకంగా మార్చేశారన్నమాట.

* చైనాలో శిలాజాలుగా నిలిచి ఉన్న అలనాటి గులాబీ పూల విశేషాలతో పాటు ప్రపంచంలో వివిధ రకాల ప్రాంతాల్లో పూసే పూలరకాల గురించిన వివరాలూ పొందుపరిచారు.

* ఇక్కడ రోజా పూలతో తయారుచేసిన నూనె, నీళ్లు, టీ మొదలైన ఉత్పత్తుల్నీ ఉంచారు.

మీకు తెలుసా?
* ‘రోస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి రోజ్‌ అనే పేరొచ్చింది.
* గ్రాము గులాబీ నూనె తీయాలంటే రెండు వేల పువ్వులు అవసరమవుతాయి.
* అన్ని వాతావరణాల్లో ఉంటుంది కాబట్టి దీన్ని ‘యూనివర్సల్‌ ఫ్లవర్‌’గా పిలుస్తారు.
* ప్రపంచవ్యాప్తంగా రోజాపూలను ఎక్కువగా ఎగుమతి చేసేది నెదర్లాండ్స్‌.
* ఈక్వెడార్‌లోని 54 శాతం భూభాగంలో గులాబీ తోటల్నే పెంచుతారు.
* పూల తోటల నుంచి ఏటా 150 మిలియన్‌ రోజా మొక్కల కొనుగోళ్లు జరుగుతున్నాయి.
* అతి ప్రాచీనమైన గులాబీ 350 లక్షల సంవత్సరాల క్రితం నాటిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని