ఓ పాప పోరాటం... భలే సంచలనం!

పర్యావరణంపై టీవీలో కార్యక్రమం వస్తుంటే పిల్లలు ఏం చేస్తారు? ఛానెల్‌ మార్చేస్తారు... లేదా చూసి మర్చిపోతారు... కానీ ఆ పాప అలా చేయలేదు! మరిన్ని వివరాలు తెలుసుకుంది... వాటిని ప్రచారం చేసింది... పెద్ద ఉద్యమమే చేపట్టింది! మరి ఆ పాప వయసెంతో తెలుసా? ఏడేళ్లు!

Published : 24 Jun 2016 01:00 IST

ఓ పాప పోరాటం...
భలే సంచలనం!

పర్యావరణంపై టీవీలో కార్యక్రమం వస్తుంటే పిల్లలు ఏం చేస్తారు? ఛానెల్‌ మార్చేస్తారు... లేదా చూసి మర్చిపోతారు... కానీ ఆ పాప అలా చేయలేదు! మరిన్ని వివరాలు తెలుసుకుంది... వాటిని ప్రచారం చేసింది... పెద్ద ఉద్యమమే చేపట్టింది! మరి ఆ పాప వయసెంతో తెలుసా? ఏడేళ్లు!

ట్టుమని ఏడేళ్లు లేని పాప ఇప్పుడు పెద్ద వాళ్లను సైతం ఆలోచించేలా చేస్తోంది. అందరినీ చైతన్యవంతుల్ని చేస్తోంది. చిన్న వయసులోనే ఇంత పెద్ద పని చేస్తున్న ఆ పాపే మెరిడిత్‌ మాస్‌. బ్రిటన్‌లోని బెడ్‌పోర్డ్‌షైర్‌లో ఉంటుంది.

ఇంతకీ ఈ చిన్నారిలో ఇంత మార్పు తెచ్చిందేమిటో తెలుసా? ‘స్ట్రా’!

మనం ఎన్నో సార్లు కూల్‌డ్రింకో, కొబ్బరి నీళ్లొ తాగి పడేసే ‘స్ట్రా’లు పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తాయో ఓ టీవీ కార్యక్రమంలో చూసిందీ పాప. చూసి వదిలేయకుండా ఇంటర్‌నెట్‌లో వెతికి ఎన్నో వివరాలు తెలుసుకుంది. ఆ వివరాలు తెలిశాక ఏకంగా ‘స్ట్రా’లపై పెద్ద పోరాటమే చేపట్టింది.

మరి ఆ పాప తెలుసుకున్న వివరాలేంటో తెలుసా?

* మనమంతా వాడి పారేసే స్ట్రాల వల్ల పెద్ద పెద్ద సముద్రాలు కూడా కలుషితం అవుతున్నాయి!

* ప్రపంచవ్యాప్తంగా రోజూ 50 కోట్ల స్ట్రాలను వాడి పడేస్తున్నారు!

* సముద్రాల్ని కలుషితం చేస్తున్న తొలి పది వ్యర్థాల్లో ‘స్ట్రా’ కూడా ఒకటి!

* స్ట్రాలలో ఉండే పాలీప్రొపలీన్‌ అనే పదార్థం భూమిలో కలిసిపోదు. సూర్యరశ్మి తగిలి చిన్న ముక్కలుగా మారి చివరకి సముద్రంలోకి చేరి అట్టడుగున పేరుకుపోతున్నాయి!

* వీటిని తిన్న సముద్రజీవులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి!

ఇవన్నీ తెలుసుకున్నాక ఆ పాప చాలా బాధపడింది. నాకెందుకులే అని వూరుకోకుండా ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తోంది. సంతకాల సేకరణ మొదలుపెట్టింది. ఆమె చెబుతున్న వివరాలు విని పెద్దలంతా మద్దతు పలుకుతున్నారు. అంతటితో వదిలిపెట్టలేదా చిన్నారి. ఓ వెబ్‌సైట్‌ ద్వారా పిటీషన్‌ వేసింది. సమస్యలపై ప్రజలు ఆశించే మార్పులపై పిటీషన్‌ పెట్టే అవకాశాన్ని చేంజ్‌.ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ కల్పిస్తోంది. ఈ వెబ్‌సైట్లో దాదాపు 10 కోట్ల మంది సభ్యులున్నారు. వారందరి మద్దతుతో ఆ పాప కోరుతున్నదేమిటో తెలుసా? ‘స్ట్రాలను తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక మీదట కాగితపు స్ట్రాలను తయారు చేయాల’ని! చూశారా... ఓ చిన్న పాప కూడా ఎంత పెద్ద పని మొదలుపెట్టిందో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని