మెచ్చే అందమంట... వెచ్చని సరస్సంట!

చుట్టూ పచ్చగా ఉన్న పర్వతాలు... ఆ మధ్యలో ఓ వెచ్చని సరస్సు... చూడటానికి ఎప్పుడూ పొగలు కక్కుతూ ఉంటుంది... పేరు ఫ్రయింగ్‌ పాన్‌. ఇది ఎందుకసలు వేడిగా ఉంటుంది? ఇంకా దీని ప్రత్యేకతలేమిటి? తెలుసుకోవాలనుందా? చదివేయండి...

Published : 27 Jun 2016 01:32 IST

మెచ్చే అందమంట... వెచ్చని సరస్సంట!

చుట్టూ పచ్చగా ఉన్న పర్వతాలు... ఆ మధ్యలో ఓ వెచ్చని సరస్సు... చూడటానికి ఎప్పుడూ పొగలు కక్కుతూ ఉంటుంది... పేరు ఫ్రయింగ్‌ పాన్‌. ఇది ఎందుకసలు వేడిగా ఉంటుంది? ఇంకా దీని ప్రత్యేకతలేమిటి? తెలుసుకోవాలనుందా? చదివేయండి మరి.
ఏమిటీ సరస్సు ప్రత్యేకత?
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద వేడి నీటి సరస్సుల్లో ఇదొకటి. అలాగని చక్కగా ఆ నీళ్లలోకి దిగి మనం వెచ్చగా స్నానం చేయవచ్చనుకోకండి. ఎందుకంటే సంవత్సరం పొడవునా దీనిలో నీరు 50 నుంచి 60 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఒకోసారి ఏకంగా 74 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు కూడా చేరుకుంటుంది.


ఎక్కడుంది?
న్యూజిలాండ్‌లోని వైమాంగూలో. అగ్ని పర్వతం పేలుడు వల్ల ఏర్పడ్డ రిఫ్ట్‌ లోయలో.
ఎలా ఏర్పడింది?
1886లో మౌంట్‌ తారావెరా అగ్ని పర్వతం బద్ధలు కావడం వల్ల ఏర్పడింది. 200 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు దాదాపుగా ఆరు మీటర్ల లోతు ఉంటుంది.


ఈ నీరు ఎందుకు వేడిగా ఉంటుంది?
అగ్ని పర్వతం పేలినప్పుడు ఆ ప్రాంతంలో 17 కిలోమీటర్ల మేర అక్కడక్కడా చిన్న చిన్న బిలాలు ఏర్పడ్డాయి. వేడిగా ఉన్న ఆ బిలాల్లోకి వర్షపు నీరు చేరింది. అక్కడ భూగర్భ జలం కూడా వేడిగా ఉన్నందువల్ల వేడినీటి బుగ్గలు పుట్టుకొచ్చాయి. కార్బన్‌డైఆక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వాయువులు అక్కడ ఏర్పడిన రంధ్రాల నుంచి పైకి ఎగజిమ్ముతూ ఉంటాయి. అందువల్ల దీనిలో నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది.


మరి ఈ వేడి నీటిలో చేపలుంటాయా?
ఇదే విషయం మీద అక్కడి ఆక్లాండ్‌ విశ్వవిద్యాలయం వాళ్లు కూడా పరిశోధన చేశారు. ఈ సరస్సులో అధిక ఉష్ణోగ్రతల్లో జీవించే కొన్ని రకాల ఏక కణ జీవులు మాత్రమే ఉంటాయని తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని