రాళ్లు పరిచి... విగ్రహాలుగా మలిచి!

అనగనగా ఒక లోయ. ఆ లోయను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎటు చూసినా బోలెడు విగ్రహాలు, గోడలు, బురుజులు, గుమ్మాలు కనిపిస్తాయి. అవన్నీ రాళ్లతో చేసినవే. అయితే అది కాదు విశేషం. వాటన్నింటినీ చేసింది ఓ తాతయ్య. ఆయన ఇరవై ఏళ్ల పాటు పడిన శ్రమ ఇప్పుడొక అందాల లోయగా మారిపోయింది.

Published : 22 Jul 2016 01:34 IST

రాళ్లు పరిచి... విగ్రహాలుగా మలిచి!

ఒకప్పుడు అది మామూలు లోయ... ఇప్పుడు మాత్రం అద్భుత పర్యటక ప్రదేశం... అక్కడ చిన్న రాళ్లే పెద్ద రాతి విగ్రహాలుగా మారాయి... ఇంతకీ వాటిని ఎవరు చేశారు? ఆలోయ ఎక్కడుంది? ఏంటా సంగతులు?

అనగనగా ఒక లోయ. ఆ లోయను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎటు చూసినా బోలెడు విగ్రహాలు, గోడలు, బురుజులు, గుమ్మాలు కనిపిస్తాయి. అవన్నీ రాళ్లతో చేసినవే. అయితే అది కాదు విశేషం. వాటన్నింటినీ చేసింది ఓ తాతయ్య. ఆయన ఇరవై ఏళ్ల పాటు పడిన శ్రమ ఇప్పుడొక అందాల లోయగా మారిపోయింది.

* ఆ తాతయ్య పేరు సాంగ్‌ పెయిలన్‌. చిన్న చిన్న రాళ్లను ఒద్దికగా సర్ది పెద్ద రాతి విగ్రహాలు చేయగలడు.

* ఆయనకిప్పుడు 76 ఏళ్లు. 56 ఏళ్ల వయసులో ఈ లోయను ప్రపంచంలో అందరూ మెచ్చే పర్యటక ప్రదేశంగా తీర్చి దిద్దాలనుకున్నాడు.

* ఇంతకీ ఈయనకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆయన ఓసారి అమెరికాలో సౌత్‌ డకోటా రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ ఓ పర్వతంపై చెక్కి ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుల ప్రతిమలు చూశాడు. మనమైతే చూసి ఆశ్చర్యపడి వదిలేస్తాం. కానీ తాతయ్య కళాకారుడు కదా! అందుకే రాళ్లతో అలా ఏదో ఒకటి తన సొంత దేశంలోనూ తయారు చేయాలనుకున్నాడు.

* వెంటనే ఆయన సొంత దేశం చైనాకు వచ్చాడు. అక్కడ గుయౌజు రాష్ట్రంలో యెలెంగ్‌ అని ఓ లోయ ఉంది. సొంత డబ్బులతో రెండు లక్షల చదరపు మీటర్ల భూమిని కొన్నాడు. 1996లో అక్కడున్న చిన్న చిన్న రాళ్లను పరిచి ఆ ప్రాంతాన్ని అందంగా మలచడం మొదలు పెట్టాడు.

* అప్పట్లో అక్కడుండే గిరిజనులు గనుల్లో మైనింగ్‌ పనులకు వెళ్లి, అక్కడొచ్చిన రాళ్లను అమ్మి జీవిస్తుండేవారట. వారి వద్ద నుంచి రకరకాల రాళ్లను సేకరించి ఆయన ఈ విగ్రహాలు తయారు చేస్తూ వచ్చాడు. అందుకు వారంతా ఆయనకు ఎంతో సాయం చేశారు కూడా.

* ఆ ప్రాంతం చుట్టూ రాళ్లు పరిచి గోడలు చేశాడు. ఎత్తైన గుమ్మటాలు, గుమ్మాలు సరేసరి. ఆ మధ్య మధ్యలో చైనా సంస్కృతికి అద్దం పట్టే బోలెడు విగ్రహాలు, జంతువుల ఆకారాలను రాళ్లతో తయారు చేసి అందంగా పేర్చాడు. దాన్నో కళా గ్రామంగా తీర్చి దిద్దాడు.

* పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందంటారు కదా. ఈ తాతయ్య దాన్నే చేసి చూపాడు. అందుకే ఇప్పుడు ఈయనను ‘ఫాదర్‌ ఆఫ్‌ యెలెంగ్‌ వ్యాలీ’ అంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని