తాబేలు డిప్ప...ఏమిటి దీని గొప్ప!

తాబేలు అనగానే దాని గుండ్రని డిప్ప గుర్తుకు వస్తుంది...మరి అది ఎందుకు ఉంటుంది అనడిగితే...రక్షణ కోసం అని ఠక్కున చెప్పేస్తాం...కానీ కేవలం అందుకే కాదని కొత్తగా తెలిసింది!

Published : 25 Jul 2016 01:13 IST

తాబేలు డిప్ప...ఏమిటి దీని గొప్ప!

తాబేలు అనగానే దాని గుండ్రని డిప్ప గుర్తుకు వస్తుంది...మరి అది ఎందుకు ఉంటుంది అనడిగితే...రక్షణ కోసం అని ఠక్కున చెప్పేస్తాం...కానీ కేవలం అందుకే కాదని కొత్తగా తెలిసింది!

ఎనిమిదేళ్ల పిల్లాడు. పేరు కోబస్‌ స్నిమన్‌. దక్షిణ ఆఫ్రికాలోని వాళ్ల తోటలో ఆడుతూ మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. తవ్వుతూ తవ్వుతూ ఉంటే ఒక శిలాజం కనిపించింది. అటువైపుగా వెళుతున్న కొంతమంది శాస్త్రవేత్తలు ఆ శిలాజాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దానిపై పరిశోధనలు చేశారు. చివరకు కొత్త సంగతి తెలుసుకున్నారు.

* ఇంతకీ బయటపడింది ఏంటో తెలుసా? ఓ తాబేలు శిలాజం.

* తాబేళ్లకు ఉండే పెద్ద డిప్పలు వాటి రక్షణకు మాత్రమే అనుకుంటాం. కానీ ఇవి మొదట్లో భూమిలో బొరియలు తవ్వుకోవడానికి ఉపయోగపడేవట.

* కొత్తగా బయటపడ్డ తాబేలు డిప్పతో పాటు దక్షిణ ఆఫ్రికా కారో బేసిన్‌ ప్రాంతంలో 260 మిలియన్‌ ఏళ్ల క్రితం అంటే దాదాపు ఇరవై ఆరు కోట్ల ఏళ్ల క్రితం నాటి రకరకాల తాబేళ్ల శిలాజాల్ని పరిశీలించి ఈ విషయం బయటపెట్టారు.

* ఈ తాబేలు శిలాజావశేషాల్లో వెడల్పైన పక్కటెముకల వరుస బలహీనంగా కనిపించినప్పటికీ ఛాతి దగ్గర మాత్రం దృఢంగా ఉండేది. ఈ పక్కటెముకల నుంచే తాబేలు డిప్ప కాలక్రమంలో రూపొందింది.

* కానీ ఈ డిప్ప అప్పట్లో రక్షణ కోసం కాకుండా తవ్వుకోవడానికి ఉపయోగపడేది. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి తాబేళ్లు నేలను తవ్వి లోతైన పొరల్ని చేరుకుని అందులో దాక్కునేవట.

మీకు తెలుసా?
* తాబేలు డిప్ప... ఒకదానికొకటి అనుసంధానమైన అరవై రకాల ఎముకలతో ఉంటుంది.
* ఇవి గొంతుతో వాసన పసిగట్టగలవు.
* అంటార్కిటికాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉంటాయి.
* ప్రాచీన రోమన్‌ సైనికులు తాబేలు మాదిరే ఆత్మరక్షణ కోటను ఏర్పాటుచేసుకునేవారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని