సాహసాల తాతయ్య! ప్రపంచాన్ని చుట్టాడయ్యా!!

అనగనగా ఓ తాతయ్య... ఏకంగా ప్రపంచాన్నే చుట్టి వచ్చాడు... ఎలాగో తెలుసా? హాట్‌ బెలూన్‌పై... బాబోయ్‌ పేద్ద సాహసమే... అందుకే ప్రపంచ రికార్డు కొట్టేశాడు... మరి ఆ వివరాలేంటో చదివేద్దామా! ఎప్పుడైనా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ గురించి విన్నారా? వేడి గాలి సాయంతో బెలూన్‌ను పైకి ఎగిరేలా చేస్తారు.

Published : 26 Jul 2016 01:51 IST

సాహసాల తాతయ్య! ప్రపంచాన్ని చుట్టాడయ్యా!!

అనగనగా ఓ తాతయ్య... ఏకంగా ప్రపంచాన్నే చుట్టి వచ్చాడు... ఎలాగో తెలుసా? హాట్‌ బెలూన్‌పై... బాబోయ్‌ పేద్ద సాహసమే... అందుకే ప్రపంచ రికార్డు కొట్టేశాడు... మరి ఆ వివరాలేంటో చదివేద్దామా!

ప్పుడైనా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ గురించి విన్నారా? వేడి గాలి సాయంతో బెలూన్‌ను పైకి ఎగిరేలా చేస్తారు. ఇలాంటి బెలూన్లను కాసేపు ఆకాశంలో ఎగరడానికి మాత్రమే రూపొందిస్తారు. కానీ రష్యాకు చెందిన అరవై ఏళ్ల ఫెదర్‌ కొన్యుఖొవ్‌ అనే తాతయ్య ఇలాంటి పేద్ద హాట్‌ ఎయిర్‌ బెలూన్‌తో ప్రపంచాన్ని చుట్టివచ్చాడు.

* దాదాపు 34 వేల కిలోమీటర్ల దూరాన్ని 11 రోజుల్లో ప్రయాణించాడు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌పై ప్రపంచాన్ని వేగంగా చుట్టి వచ్చిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.

* ఆస్ట్రేలియాలో జులై 12న మొదలైన ఈ తాతయ్య ప్రయాణం... న్యూజిలాండ్‌, పసిఫిక్‌ మహా సముద్రం నుంచి దక్షిణ అమెరికా, దక్షిణ అట్లాంటిక్‌, హిందూ మహాసముద్రం మీదుగా సాగింది. తిరిగి ఇదే నెల 23న ఆస్ట్రేలియాలో దిగిపోయాడు.

* రోజుల తరబడి ఆకాశంలో ఎగురుతూ ఈ సాహసం చేయడమంటే మాటలు కాదు. బోలెడు ఇబ్బందులు ఉంటాయి. ఓసారి ఈ తాతయ్య ఒకవైపు వెళ్లాలనుకుంటే మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న అంటార్కిటికా వైపు ఈ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ వెళ్లిందట. అక్కడి నుంచి ధైర్యంగా తన ప్రయాణాన్ని కొనసాగించి ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరుకున్నాడు.

* ఈ తాతయ్య ప్రయాణించిన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ రెండు వందల అడుగుల పొడవుతో ఉంటుంది. అందులో పడుకోవడానికి ఏర్పాట్లు, ఆహారం, నీళ్లు వంటివి ఉంచుకునేలా ప్రత్యేక సదుపాయాలతో తయారు చేశారు.* అంతక్రితం 2002లో అమెరికాకు చెందిన స్టీవ్‌ ఫోసెట్‌ అనే ఆయన మొత్తం 13 రోజుల్లో ఈ సాహసం చేసి రికార్డు కొట్టారు. దాన్నే ఇప్పుడీ తాతయ్య అధిగమించి సంచలనం సృష్టించాడు.

* ఈ తాతయ్యకి సాహసాలు అలవాటే. ఇదివరకే అతిచల్లగా ఉండే ఉత్తరదక్షిణ ధ్రువాల దగ్గరకు వెళ్లి వచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని