పోకెమాన్‌ సంగతులు విందామ్‌!

పోకెమాన్‌ గురించి తెలియనివారుండరేమో... కార్టూన్‌ ధారావాహికల్లో, వీడియో గేముల్లో ఎంతగానో అలరించింది... ఇప్పుడు సరికొత్తగా నిజమైన పరిసరాల్లోకి వచ్చేసింది... పోకెమాన్‌ గో అంటూ పిల్లల్నీ పెద్దల్నీ పరుగులు పెట్టిస్తోంది... మరి దాని చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందామా!

Published : 27 Jul 2016 02:13 IST

పోకెమాన్‌ సంగతులు విందామ్‌!

పోకెమాన్‌ గురించి తెలియనివారుండరేమో... కార్టూన్‌ ధారావాహికల్లో, వీడియో గేముల్లో ఎంతగానో అలరించింది... ఇప్పుడు సరికొత్తగా నిజమైన పరిసరాల్లోకి వచ్చేసింది... పోకెమాన్‌ గో అంటూ పిల్లల్నీ పెద్దల్నీ పరుగులు పెట్టిస్తోంది... మరి దాని చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందామా!సినిమాల్లో, కార్టూన్‌ ధారావాహికల్లో, వీడియోగేముల్లో హల్‌చల్‌ చేసిన పోకెమాన్‌ పుట్టి ఇప్పటికి ఇరవై ఏళ్లు అవుతోంది. 1996 ఫిబ్రవరి 27న తొలిసారిగా జపాన్‌లో పుట్టింది. మొదట్లో పిల్లలు ఎక్కడికైనా వెళుతూ వెంటబెట్టుకుని తీసుకెళ్లడానికి ఈ ఆటను తయారుచేశారు. అప్పట్లో ఈ ఆట పేరు ‘గేమ్‌ బాయ్‌’. ఇందులో మాన్‌స్టర్‌గా పిలిచే రాకాసి జీవులు ఉండేవి. ఆట ఆడేవారి సూచనల ప్రకారం ఒకదానికొకటి యుద్ధం చేసుకునేవి. తర్వాత తర్వాత దీన్నే ‘పొకెట్టో మాన్‌స్టా’ అని పిలిచేవారు. అంటే పాకెట్లో ఉండే రాకాసులన్నమాట. అదే క్రమంగా పోకెమాన్‌గా మారిపోయింది.

* ఇంతకీ దీని సృష్టికర్త ఎవరో తెలుసా? సతోషి తజిరి అనే ఆయన. చిన్నతనంలో అందరు పిల్లల్లానే పురుగులు, కీటకాల్ని పట్టుకుని సీసాల్లో ఉంచి అవసరమైనప్పుడు ఆడుకునేవాడట. అవి తన సైనికులని, తన కోసం యుద్ధం చేస్తాయని సరదాగా అనుకునేవాడట. ఆ ఆలోచనతోనే ఈ పోకెమాన్‌ ఆటను రూపొందించారు.

* త్వరలోనే అందర్నీ ఆకట్టుకుని టీవీల్లోకి, సినిమాల్లోకి దూకేసింది. ఆపై ప్రపంచమంతా తిరిగేసింది.

* అసలీ ఆట అప్పట్లో ఎలా ఉండేది? ఇందులో మొత్తం 151 పోకెమాన్స్‌ ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఆ వింత జీవుల్ని పట్టుకుని సొంతం చేసుకోవాలి. మన తరఫున పోరాటం చేయడానికి వాడుకోవాలి. వీటితో యుద్ధం చేయడానికి నిబంధనలు కూడా ఉన్నాయి. పైగా ఈ వింత జీవులు చచ్చిపోవడం ఉండదు. స్పృహ తప్పుతాయంతే. వాటిని వెంటనే పోకెబాల్‌ అనే ఒక బంతిలో వేస్తే వశం అవుతాయి. లేదంటే తిరిగి ప్రాణం పోసుకుని వచ్చేస్తాయి. యుద్ధానికి మన అదుపులోకి వచ్చిన పోకెమాన్లలో ఒక పోకెమాన్‌ను మాత్రమే వాడాలి.

* రోల్‌ ప్లేయింగ్‌, అడ్వెంచర్‌, పజిల్‌, ఫైటింగ్‌, అగ్‌మెంట్‌ రియాలిటీ వంటి విభాగాల్లో పోకెమాన్‌ గేములు విడుదలయ్యాయి.

* నింటెండోసంస్థ ఇప్పటి వరకు 270 మిలియన్లకు పైగా పోకెమాన్‌ గేముల్ని అమ్మింది.

* పోకెమాన్‌ మొదట్లో 151 ఉన్నా ఇప్పుడు వాటి సంఖ్య 721కి పెరిగింది.

* దక్షిణ పసిఫిక్‌లో ఉన్న ఓ బుల్లి దేశం నియూలో పోకెమాన్‌ రూపాల్ని కరెన్సీపై ముద్రించారు. * ఇందులో మొత్తం 122 రకాల ఆటలున్నాయి.

విజ్ఞాన రంగంలోనూ దీని ప్రభావం ఉంది. అందుకే 2008లో కనిపెట్టిన ఓ ప్రోటీన్‌కు పోకెమాన్‌ పికాచు పేరు పెట్టారు.

పసుపు రంగులో రెండు వైపుల కొమ్ములతో ఎర్రని బుగ్గలతో ఉండే పికాచు పోకెమాన్‌ ఈ ఆటకు మస్కట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని