తామరల చెనంట...రికార్డు కొట్టెనంట!

కనుచూపు మేరంతా తామరలే... ఎటు చూసినా విరిసిన పూలే... ఇది ప్రపంచంలోనే పెద్ద తామర చేను! ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డుల్లోకీ ఎక్కింది!

Published : 29 Jul 2016 01:24 IST

తామరల చెనంట...రికార్డు కొట్టెనంట!

కనుచూపు మేరంతా తామరలే... ఎటు చూసినా విరిసిన పూలే... ఇది ప్రపంచంలోనే పెద్ద తామర చేను! ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డుల్లోకీ ఎక్కింది!తామర పూలు ఎంత అందంగా ఉంటాయో కదా! గులాబీ, తెలుపు రంగుల్లో కనిపించే ఇవి కనిపిస్తే గబుక్కున కోసేసుకోవాలనిపిస్తుంది. కొన్ని దేశాల్లో మాత్రం బురద నేలల్లో వీటిని పొలాల్లా పెంచి ఆ పూలు, విత్తనాలు, దుంపల్ని అమ్ముతారు. అలాంటి వాటిల్లో ప్రపంచంలోనే పెద్దది చైనాలో ఉంది.

* బురద నేలల్లో మడులు మడులుగా కట్టి, నీటిని నిలిచేలా చేసి తామరలను సాగు చేస్తున్నారు. మధ్యలోకి వెళ్లి పూలు కోసుకునేందుకు వీలుగా సన్నని గట్లుంటాయి. అచ్చం మన వరి చేల్లో గట్లుంటాయే అలాగన్నమాట.

* ప్రపంచంలో ఇంత పేద్ద తామరల చేను ఇంకెక్కడా లేదని గిన్నిస్‌బుక్‌ అధికారులు ప్రకటించారు.

* మరి దీని విస్తీర్ణం ఎంతో తెలుసా? దాదాపు 15 వేల ఎకరాలు! పెద్ద ఫుట్‌బాల్‌ మైదానాలు ఉంటాయి కదా. అలాంటివి దాదాపు ఏడు వేల మైదానాలు కలిపితే ఎంతుంటుందో ఈ చేను అంతుంటుంది!

* చైనాలోని జియాంగ్సీ రాష్ట్రంలో కొంతమంది రైతులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వ భూమిలోనే దీన్ని సాగు చేస్తున్నారు.

* ఇక్కడి నుంచి ఏటా 80 లక్షల కిలోల పువ్వులు అమ్మకానికి వెళతాయి. అంతేకాదు తామర విత్తనాలు, వేళ్లకుండే దుంపలు, లేత ఆకులు లాంటి వాటిని ఆసియా వంటకాల్లో వాడతారు. దీని తూళ్ల నుంచి వచ్చే పీచుతో చేసిన నార దుస్తుల్ని బౌద్ధ సన్యాసులు వేసుకుంటారట. అందుకే ఈ నీటి మొక్కలో ప్రతి భాగానికీ గిరాకీనే.మీకు తెలుసా?
అనుకూల వాతావరణం ఉంటే తామర విత్తనాలు 1300 సంవత్సరాల తర్వాత కూడా మొలకెత్తుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని