అందాల లోకం... ఐస్‌క్రీమ్‌ల మయం!

అదో ఐస్‌క్రీమ్‌ల లోకం... అడుగుపెట్టగానే నోరూరిపోతుంది... ఓ పక్క చాక్లెట్‌ ఫౌంటెన్లు... మరోపక్క వెలుగులు చిమ్మే కోన్‌లు... ఎటు చూసినా రకరకాల ఐస్‌క్రీమ్‌ రూపాలే! చూడాలని ఉందా? అయితే పదండి మరి!

Published : 04 Aug 2016 00:59 IST

అందాల లోకం... ఐస్‌క్రీమ్‌ల మయం!

అదో ఐస్‌క్రీమ్‌ల లోకం... అడుగుపెట్టగానే నోరూరిపోతుంది... ఓ పక్క చాక్లెట్‌ ఫౌంటెన్లు... మరోపక్క వెలుగులు చిమ్మే కోన్‌లు... ఎటు చూసినా రకరకాల ఐస్‌క్రీమ్‌ రూపాలే! చూడాలని ఉందా? అయితే పదండి మరి!మీరెన్నో రకాల మ్యూజియాలు చూసి ఉంటారు. కానీ ఐస్‌క్రీమ్‌లతో రూపొందించినది చూశారా? అదే అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్తగా మొదలైంది. దీన్ని చూడ్డానికి వెళ్లారనుకోండి, టిక్కెట్టుతోబాటు ఓ ఐస్‌క్రీమ్‌ కూడా ఇస్తారు. దాన్ని తింటూ లోపలికి వెళ్లారనుకోండి, లోపలంతా ఐస్‌క్రీమ్‌ల మయమే. ఆడుకునే ఆటలు, వెలిగే దీపాలు, చిమ్మే ఫౌంటెన్లు... ఇలా అన్నీ రకరకాల ఐస్‌క్రీమ్‌లను తలపించేవే.

* అసలు దీని పేరే ‘ది మ్యూజియం ఆఫ్‌ ఐస్‌ క్రీమ్‌’. లోపల మీకు కావలసినన్ని రకాల ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. ఇక ఈ భవనమంతా ఐస్‌క్రీమ్‌ థీమ్‌తోనే ఉంటుంది. ఓ చోట పెద్ద కోన్‌ నుంచి ఐస్‌క్రీం కరిగిపోతున్నట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే వేలాడుతూ కోన్‌లు కనిపిస్తాయి. అయితే అవి దీపాలన్నమాట. మరో చోట పెద్ద ఫౌంటెన్‌ కనిపిస్తుంది. దగ్గరకెళ్లి చూస్తే అది చిమ్మేది చాక్లెట్‌ ద్రవాన్నే.

* ఏ గోడ మీద చూసినా ఐస్‌క్రీమ్‌ పెయింటింగ్‌లు భలే అందంగా ఉంటాయి. అంతేకాదు, వాటి కింద ఆ రకం ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన వివరాలు రాసి ఉంటాయి.* పుల్లల్లా, గోళీల్లా ఉండే రంగు రంగుల స్ప్రింక్లర్లను ఐస్‌క్రీమ్‌లపై చల్లుతుంటారు తెలుసుగా? వాటితో ఇక్కడ ఓ స్విమ్మింగ్‌పూలే ఉంది. దాన్నిండా నీరు కాకుండా ఇవే ఉంటాయి. పిల్లలు, పెద్దలూ ఇందులో దూకి తెగ అల్లరి చేస్తుంటారు.

* ఇక్కడ వూగే ఉయ్యాలేమో శాండ్‌విచ్‌లా ఉంది. అటొకరు ఇటొకరు కూర్చుని కిందకీ పైకీ వూగే ‘సీసా’ తెలుసుగా? అది కూడా ఐస్‌క్రీమ్‌ స్కూపర్‌లా ఉంది.

* ఇంకో వింత తెలుసా? అక్కడ లాకెట్లు, చెవులకు పెట్టుకునే దుద్దులులాంటివి అమ్మే దుకాణాలు ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఐస్‌క్రీమ్‌ల రూపాలే.

* ‘చార్లీ అండ్‌ ద చాక్లెట్‌ ఫ్యాక్టరీ’ అనే హాలీవుడ్‌ సినిమా చూశారా? అది చూశాకే ఇలాంటి మ్యూజియం తయారు చేయాలని బన్‌, మనీష్‌ ఓరా అనే ఇద్దరూ ఆలోచించారు. వెంటనే 30 మంది ఐస్‌క్రీం వంటగాళ్లని కలుసుకుని ఈ భలే మ్యూజియం రూపొందించారు.* అమెరికాలో పిల్లలకి ఆగస్టంతా వేసవి సెలవలే. అందుకోసమే దీన్ని ప్రారంభించారు. అందుకే ఇది ఈ నెల మాత్రమే ఉంటుంది.

* దీన్ని ప్రారంభించగానే 30 వేల టిక్కెట్లు కేవలం అయిదు రోజుల్లో అమ్ముడైపోయాయట! మరైతే వెంటనే నాన్ననడిగి న్యూయార్క్‌కి బయలుదేరండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని