చెక్క ఓడంట.... చూడ చక్కనంట!

అదో పొడవైన చెక్క నౌక... ఇంతవరకే అయితే చెప్పుకోనక్కర్లేదు... చెక్కతో చేసిన వాటిల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది... పైగా దీని ప్రయాణం వెనుక ఓ మంచి కారణం ఉంది... ఇంతకీ ఏంటది? ఏమా విశేషాలు?

Published : 06 Aug 2016 00:55 IST

చెక్క ఓడంట.... చూడ చక్కనంట!

అదో పొడవైన చెక్క నౌక... ఇంతవరకే అయితే చెప్పుకోనక్కర్లేదు... చెక్కతో చేసిన వాటిల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దది... పైగా దీని ప్రయాణం వెనుక ఓ మంచి కారణం ఉంది... ఇంతకీ ఏంటది? ఏమా విశేషాలు?

చెక్క నౌక తొమ్మిది నెలల పాటు సముద్ర ప్రయాణం చేసింది. యూకే నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి ఈమధ్యే చేరుకుంది. అందులోని ప్రయాణికులంతా గొప్ప సాహసం చేసిన అనుభూతి పొందారు. ఇంతకీ దీని అసలు విశేషం ఏంటో తెలుసా? శారీరక లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నౌక ఇది. ఆకాశాన్ని తాకినట్టుండే తెరచాపలతో భలేగా ఉంటుందిది.

* ‘టెనాషియస్‌’ పేరుతో పిలిచే ఈ నౌక 29వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసింది. ఇందులో అంధులు, మూగవారు, చెవిటివారు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వారు, కుర్చీకే పరిమితమైన వారు ప్రయాణించారు. అంతేకాదు ఈ నౌకలోని 40మంది సిబ్బందిలో సగం మంది దివ్యాంగులే.

 

* శారీరక లోపాలతో బాధపడుతున్నవారు అందరిలా హాయిగా నీటిపై ప్రయాణం చేయలేరు కదా. అందుకే వారికోసం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలకు చెందిన ‘జూబిలీ సెయిలింగ్‌ ట్రస్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ వారు ఈ నౌకను తీర్చిదిద్దారు. ఈ సంస్థ ఛైర్మన్‌ హ్యారీ కేటర్‌ తన అమ్మమ్మ వైకల్యంతో పడిన ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూశారు. ఆమె లాంటి వారికి ఉత్సాహంగా సముద్రంలో ప్రయాణించాలని ఉన్నా వీలులేకపోవడాన్ని గమనించి ఈ ట్రస్టు ద్వారా ఈ నౌక ప్రయాణాన్ని ప్రారంభించారట.

* ఈ ఓడ మామూలు వాటిలా కాకుండా భిన్నంగా ఉంటుంది. ఇందులోని క్యాబిన్లు, గదులు, స్నానాల గదులు, షవర్లు, మరుగుదొడ్లు ఇలా ప్రతీ ఒకటి వైకల్యం ఉన్న వారు తేలికగా ఉపయోగించేలా ప్రత్యేకంగా చేసిపెట్టారు. అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా వివరాలు తెలిసేలా సౌకర్యాలు ఏర్పర్చారు.

* ఇలా చెక్కతో చేసిన నౌకలు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేవి. ఈ ఆధునిక కాలంలోనూ ఇలా 213 అడుగుల పొడవుతో అంటే దాదాపు ఇరవై అంతస్తుల ఎత్తుతో, 154 అడుగుల ఎత్తయిన డెక్కుతో మొత్తం 586 టన్నుల బరువుతో దీన్ని నిర్మించడం విశేషం.

* ఈ నౌకని 16 ఏళ్ల క్రితమే దాదాపు 15వందల మంది నాలుగేళ్లపాటు శ్రమించి రూపొందించారు. దీని తయారీలో దివ్యాంగులూ ఉన్నారు.

* ఇన్ని ప్రత్యేకతలున్న ఈ నౌకను ప్రస్తుతం సందర్శకుల కోసం ఆస్ట్రేలియాలోని ‘నేషనల్‌ మర్టైమ్‌ మ్యూజియం’లో ఉంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని