ఎగురుతూనే కునుకు... పక్షుల భలే కిటుకు!!

కొంచెం దూరం నడిస్తేనే మనం అలసిపోతాం. మరి పక్షులో? సముద్రాలపై నుంచి, రోజుల తరబడి వందల వేల కిలోమీటర్లు ఆగకుండా ఎగురుతూనే ఉంటాయి. వాటికి అలుపు రాదా? నిద్ర రాదా? వస్తే ఏంచేస్తాయి? అంటే... ఎగురుతూనే మధ్య మధ్యలో ఓ కునుకేసేస్తాయిట.

Published : 10 Aug 2016 01:35 IST

ఎగురుతూనే కునుకు... పక్షుల భలే కిటుకు!!

కొంచెం దూరం నడిస్తేనే మనం అలసిపోతాం. మరి పక్షులో? సముద్రాలపై నుంచి, రోజుల తరబడి వందల వేల కిలోమీటర్లు ఆగకుండా ఎగురుతూనే ఉంటాయి. వాటికి అలుపు రాదా? నిద్ర రాదా? వస్తే ఏంచేస్తాయి? అంటే... ఎగురుతూనే మధ్య మధ్యలో ఓ కునుకేసేస్తాయిట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! శాస్త్రవేత్తల పరిశోధనలో కొత్తగా ఈ విషయం తెలిసింది.

* బాగా బుల్లిగా ఉన్నప్పుడు మనం మంచం మీద పడుకుంటేనే బోలెడుసార్లు దొర్లి కింద పడిపోయి ఉంటాం. కానీ పక్షులేమో ఏకంగా గాల్లోనే నిద్ర పోతాయట. అయినా పడిపోవట. భలే వింతగా ఉంది కదూ!

* కొన్ని పక్షులు వలస వెళ్లేప్పుడు ఎక్కడా ఆగకుండా వారాల తరబడి ఎగురుతూనే ఉంటాయి. అవే కాదు, కొంచెం కొంచెం దూరాలు ఎగిరే పక్షులు కూడా మధ్యలో అలసట అనిపిస్తే ఇలా గాల్లో ఎగురుతూనే నిద్రపోగలవు. ఆ శక్తి వాటికి సహజంగానే ఉంది.

* ఇంతకీ ఈ సంగతి ఎలా తెలిసిందంటే... జర్మనీ దేశం లేదూ? అక్కడ కొందరు శాస్త్రవేత్తలు ఈ విషయం మీద పరిశోధన చేశారు. నిద్ర పోతున్నప్పుడు వాటి మెదళ్లలో ఒక రకమైన విద్యుత్‌ తరంగాలు విడుదల వుతాయని తెలుసుకున్నారు.

* ఆ తరంగాల్ని గుర్తించేందుకు ‘ఫ్లైట్‌ డాటా రికార్డర్‌’ అనే ఓ బుల్లి పరికరాన్ని రూపొందించారు.

  * రక రకాల పక్షులున్న ఓ జాతీయ పార్కు అధికారులతో మాట్లాడి అక్కడున్న పక్షలన్నింటికీ ఈ రికార్డర్‌లని కట్టి వదిలారు. అప్పుడే ఎగురుకుంటూ గూళ్లకు వచ్చిన పక్షులు, వలస పక్షులకు కట్టిన రికార్డర్లని సేకరించి వాటిని అధ్యయనం చేశారు. వాటి మెదళ్ల నుంచి ఎగిరేప్పుడు కూడా ఆ విద్యుత్‌ తరంగాలు రావడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇంకేముంది? అవి ఎగిరేప్పుడూ సగం మూసిన కళ్లతో భలేగా బజ్జుంటున్నాయని తేల్చేశారు. ఇప్పుడేమో అవి ఎంత సమయం కునుకేస్తున్నాయో తేల్చే పనిలో పడ్డారు.

మీకు తెలుసా?
* మల్లార్డ్‌ బాతులు, మరికొన్ని రకాల పక్షులు ఒక కన్ను మూసి, మరొకటి తెరిచి నిద్రపోగలవు. జంతువుల్లో మొసళ్లు, తిమింగలాలు లాంటివి కూడా ఒక కన్నుతో చూస్తూ మరో కంటితో నిద్రపోగలవట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని